వజ్రాల విలువ కోట్లల్లో ఉంటుంది. గుప్పెడు వజ్రాలు దొరికితే చాలు..కోట్ల రూపాయల డబ్బు వచ్చి పడుతుంది. ఇదే ఐడియాలో ఓ కేటుగాడు చోరీ కోసం పక్కాగా ప్లాన్ చేశాడు. ఆన్‌లైన్ ద్వారా సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సంప్రదించి.. తనకు వజ్రాలు కావాలని చెప్పాడు. అతడిని నమ్మి సూరత్ వ్యాపారి.. వజ్రాలతో హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ వ్యాపారిని అతడు ఊహించని విధంగా బురిడీ కొట్టించాడు. పెన్ను అడిగి.. దృష్టి మళ్లించి.. వజ్రాలు కొట్టేశాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీ.. హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి.. ఆ దొంగను పట్టుకున్నారు.
అఫ్జల్ గంజ్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా మంచన్‌హాలీ పీఎస్ పరిధి ఆలీపురాకి చెందిన మహ్మద్ రుహుల్లా గతంలో వజ్రాల వ్యాపారం చేసేవాడు. కానీ నష్టాలు రావడంతో వ్యాపారం మానేశాడు. అడ్డ దారిలో డబ్బును సంపాదించేందుకు ఓ పథకం పన్నాడు. ఇండియా మార్ట్ వెబ్‌సైట్లో వజ్రాలు అమ్మే వ్యాపారుల కోసం వెతికి.. సూరత్‌కు చెందిన వివేక్ జతిన్ అనే డైమండ్ మర్చంట్‌ని సంప్రదించాడు. తమకు హైదరాబాద్‌లో వజ్రాల షాప్ ఉందని.. తమకు భారీగా వజ్రాలు కావాలని ఆర్డర్ ఇచ్చాడు. వివేక్ జతిన్‌కు ఇప్పటికే హైదరాబాద్ నుంచి పలు ఆర్డర్స్ వచ్చాయి. వాటితో పాటు మహ్మద్ రుహుల్లా ఆర్డర్ కూడా తీసుకొని.. తన సోదరుడితో కలిసి.. జనవరి 25న నగరానికి వచ్చాడు. అనంతం ఓ లాడ్జిలో దిగి.. రుహులాకు సమాచారం ఇచ్చాడు. రుహుల్లా అక్కడికి వెళ్లిన తర్వాత.. వివేక్ జతిన్ తాను తెచ్చిన డైమండ్ ప్యాకేజీని చూపించాడు. ఐతే మిగతా ఆర్డర్లు పూర్తయిన తర్వాత కాల్ చేయండి.. అప్పటి వరకు డబ్బును రెడీ చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రుహుల్లా.
ఆ తర్వాత ప్లాన్ ప్రకారం.. ఓ నకిలీ వజ్రాల ప్యాకెట్‌ను రెడీ చేసుకున్నాడు. అచ్చం వివేక్ జతిన్ తెచ్చిన ప్యాకేజీలానే ఉండాలే జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత అతడికి కాల్ చేసి.. అఫ్జల్‌గంజ్‌లోని అంబికా లాడ్జికి రమ్మని చెప్పాడు. దీంత వివేక్ జతిన్ తన తమ్ముడికి వజ్రాలు ఇచ్చి లాడ్జికి పంపాడు. అప్పటికే అక్కడ ఉన్న రుహుల్లా అతడిని మాటల్లో పెట్టాడు. అదునుకోసం చూసిన వెయిటర్‌ను పిలిచాడు. తనకు వెంటనే పెన్ తెచ్చి ఇవ్వాలని అడిగాడు. ఆ సమయంలో ఆ వ్యాపారి కూడా వెయిటర్ వైపు దృష్టి పెట్టాడు. ఈ గ్యాప్‌లో రుహులా ఆ వ్యాపారి తెచ్చిన వజ్రాల ప్యాకెట్‌ను తీసుకొని.. అక్కడ తన వెంట తెచ్చుకున్న నకిలీ వజ్రాల ప్యాకెట్‌ను పెట్టాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ తర్వాత.. తనకు డబ్బులు సర్దుబాటు కాలేదని.. అయిన వెంటనే కబురు చేస్తానని చెప్పాడు. లేదంటే సూరత్‌కు వచ్చి వజ్రాలు తీసుకుంటానని నమ్మించాడు. అనంతరం వ్యాపారి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రుహుల్లా అసలైన వజ్రాలతో కర్నాటకకు పారిపోయాడు.
సదరు వ్యాపారి తిరిగి సూరత్‌కు వెళ్తూ.. సికింద్రాబాద్‌లో రైలు ఎక్కబోయే ముందు.. తాను తెచ్చిన వజ్రాలను తీసి చెక్ చేసుకున్నాడు. అక్కడ ఉన్నది నకిలీవని గుర్తించి..లబోదిబోమన్నాడు. వెంటనే ఈ విషయాన్ని తన సోదరుడు వివేక్ జతిన్‌కు చెప్పాడు. ఆ తర్వాత అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి.. లాడ్జిలో సీసీ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఓటర్ ఐడీ, మనీ పర్సు లభించాయి. అతడి సెల్ ఫోన్ నెంబర్‌తో వివరాలు మ్యాచ్ కావడంతో.. పోలీసులు అడ్రస్‌ను సేకరించారు. వజ్రాలు ఎత్తుకెళ్లిన వ్యక్తిని.. కర్నాటకలోని చిక్కబళ్లాపూర్‌కు చెందిన రుహుల్లా గుర్తించారు. అనంతరం ప్రత్యేక పోలీసుల బృందం అతడి స్వస్థలానికి వెళ్లి అరెస్ట్ చేశారు.
Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.