తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) రూటు సపరేటు. స్వపక్షంలో విపక్షంలా అనేక విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టీటీడీ (TTD) నిర్ణయాలను కూడా అనేక సందర్భాల్లో ఆయన తప్పుబట్టారు. ఇప్పుడు ఏపీలోని దేవాలయాల్లో (Temples) పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారంటూ ట్వీట్ చేశారు. ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయంగా మారిందని తప్పుబట్టారు. ఆలయ అధికారులు సొంత ప్రణాళికలను అమలు చేస్తున్నారని, ఆలయాల్లో రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ట్విట్టర్‌లో రమణ దీక్షితులు తప్పుబట్టారు.
ఓ సందర్భంలో సీఎం జగన్ (CM Jagan) విష్ణుమూర్తి ప్రతిరూపంగా రమణదీక్షితులు అభివర్ణించారు. సనాతన ధర్మం అంతమవుతున్న దశలో విష్ణుమూర్తిలా జగన్ ధర్మాన్ని రక్షిస్తున్నారన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టవస్త్రాలు సమర్పించేందుకు జగన్ తిరుమల వచ్చారు. అయితే వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ (One Man Committee report) అమలుపై జగన్, ప్రకటన చేస్తారని రమణ దీక్షితులు భావించారు. జగన్ శ్రీవారిని దర్శించుకుని ఎలాంటి ప్రకటనా చేయకుండా వెళ్లిపోయారు. దీంతో నిరాశ చెందిన రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ట్విట్టర్ (Twitter)లో సీఎం జగన్‌ను ట్యాగ్ చేసి ప్రభుత్వంపై రమణ దీక్షితులు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే.
‘‘మీ తిరుమల పర్యటన సందర్భంగా వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై ప్రకటన చేస్తారని భావించాము… మీరు ఎటువంటి ప్రకటన చెయ్యకపోవడంతో అర్చకులమంతా తీవ్ర నిరాశ చెందాం… టీటీడీలోని బ్రాహ్మణ వ్యతిరేకులు… టీటీడీలోని అర్చక వ్యవస్థను.. ఆలయ విధానాలను నాశనం చేసే లోపే తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని రమణ దీక్షితులు పేర్కొన్నారు. అలాగే తిరుమలలో జరుగుతున్న అవినీతిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. ‘‘శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయి. 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారు. ప్రస్తుతం తిరుమలలో అవినీతి రాజ్యమేలతావుంది’’ అంటూ రమణదీక్షితులు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆలయాల్లో రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.