యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Pics.

తెలుగునౌ.కాం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాల మొదలైందా?

0

రెండు సార్లు అధికారం సాధించిన టీఆర్ఎస్ లో మూడో సారి ముచ్చటగా గెలుపు అంత ఈజీ కాదని అర్థమవుతోంది. టీఆర్ఎస్ లోని నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే రెబల్ గా పోటీచేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు నాయకుల నుంచి వ్యతిరేక ప్రకటనలు గులాబీ దళాన్ని కలవరపెడుతున్నాయి.

టీఆర్ఎస్ కోసం ఆదినుంచి పనిచేసిన సీనియర్ నేతలు ఓడిపోయి పక్కకు పోయారు. అయితే వారిని అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వారంతా అసమ్మతి రాజేస్తున్నారు. తమను పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని నేతలంతా భగ్గుమంటున్నారు. టికెట్ రాకపోయినా ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనలతో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

అందుకే తాజాగా కొందరు సీనియర్ టీఆర్ఎస్ నేతలు అధిష్టానంతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి నిన్నటిదాకా పాటుపడిన నేతలంతా ఇప్పుడు గళమెత్తుతున్నారు. ఇక ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారు ఎందరో ఉన్నారు. వారంతా ఓవర్ లోడ్ తో ఉన్నారు. వారి రాకతో ఇప్పుడు ‘అసంతృప్తి’ జ్వాల ఎగిసిపడుతోంది.

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా ముందస్తు ఎన్నికలు వస్తే తమకు టికెట్ దక్కే అవకాశాలను ఇప్పటి నుంచే బేరీజు వేసుకుంటున్న నేతలు టికెట్ సాధన దిశగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీలోని తమ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇది ముదిరిపాకన పడుతోంది. అటు మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణరావు విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

టీఆర్ఎస్ ప్రస్తుతం తిరుగులేని పార్టీగా ఉంది.119 మంది ఎమ్మెల్యేల్లో టీఆర్ఎస్ కు 103 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కొందరు నేతలు పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో తమదైన శైలిలో నియోజకవర్గ స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టికెట్ వస్తే పోటీచేయడం లేదంటే విపక్ష పార్టీల నుంచి బరిలోకి దిగేందుకు యోచిస్తున్నారు.

ప్రస్తుతం టీఆర్ఎస్ లో అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవులు ఎంపీ పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత లేని ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావులు తాజాగా టీఆర్ఎస్ పై గళమెత్తుతున్నారు. వారి ప్రకటనలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఈ ముగ్గురు నేతలు ఖమ్మంలో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సారి ప్రజాక్షేత్రంలో ఉంటూ తన కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇక తుమ్మల కూడా పార్టీ వేదికల మీద పెద్దగా కనిపించడం లేదు. పైగా పార్టీకి ద్రోహం చేస్తున్న శత్రువులు పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సీనియర్లను అధిష్టానం పట్టించుకోవడం లేదన్న ఆవేదన తుమ్మల జూపల్లి పొంగులేటి లో ఉంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ లో టికెట్ వచ్చినా రాకున్నా తమ దారి తాము చూసుకునేందుకు ఈ నేతలు రెడీ అయినట్లు సమాచారం.

ఇక ఈ ముగ్గురే కాదు.. ఓవర్ లోడ్ తో సాగుతున్న టీఆర్ఎస్ లో వచ్చే ఎన్నికల నాటికి చాలా మంది గళమెత్తే చాన్స్ కనిపిస్తోంది. ప్రతి జిల్లాలోనూ బయట నుంచి వచ్చిన నేతలు కొత్త వారితో టీఆర్ఎస్ టైట్ అయ్యింది. మరింత మంది గళమెత్తే అవకాశాలు ఉన్నాయి.