Templates by BIGtheme NET
Home >> Telugu News >> థియేటర్లు.. స్కూళ్ల రీఓపెన్ పై తాజా సర్వే ఫలితాలు ఏమిటో తెలుసా?

థియేటర్లు.. స్కూళ్ల రీఓపెన్ పై తాజా సర్వే ఫలితాలు ఏమిటో తెలుసా?


లాక్ డౌన్ తో మొత్తంగా మూసుకుపోయిన సేవల విభాగాలతో పాటు.. వివిధ వ్యాపార సంస్థల్ని ఓపెన్ చేసేందుకు ప్రభుత్వంఅనుమతులు ఇవ్వటం తెలిసిందే. ఈ అన్ లాక్ లో భాగంగా సినిమా థియేటర్లు.. స్కూళ్లు ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతులుజారీ చేసింది. ఈ నెల 15 నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శనకు కేంద్రం ఓకే చెప్పేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ ప్రత్యేకంగా ఆన్ లైన్ సర్వేను నిర్వహించింది. సినిమాకు వెళతారా? స్కూళ్లకు మీ పిల్లల్ని పంపుతారా? అంటూ పలు ప్రశ్నల్ని సంధించింది. ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో నెటిజన్లు తమ అభిప్రాయాల్ని కుండ బద్ధలు కొట్టేశారు. కేంద్రం అనుమతులు మంజూరు చేసినా.. థియేటర్లకు వెళ్లేది లేదని.. స్కూళ్లకు పిల్లల్ని పంపించే ఆలోచన లేదన్న విషయాన్ని తేల్చి చెప్పారు నెటిజన్లు.

థియేటర్లలో కూర్చొని సినిమాలు ఎప్పుడు చూసే అవకాశం ఉందన్న ప్రశ్నకు 50.2 శాతం మంది వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే వెళతామని స్పష్టం చేయటం గమనార్హం. ఇందుకు భిన్నంగా థియేటర్లు ఓపెన్ చేసిన వెంటనే సినిమాకు వెళతామని 14 శాతం మంది చెబితే.. గతంలో మాదిరి థియేటర్లలో కూర్చొని సినిమా చూసే అవకాశం వస్తుందని తాము అనుకోవటం లేదని పది శాతం మంది చెప్పటం విశేషం.

లాక్ డౌన్ లో భాగంగా సినిమాను థియేటర్లలో కూర్చొని చూసే అవకాశాన్ని మిస్ అవుతున్నారా? అంటే అవునని.. 41 శాతం మంది చెబితే.. అలాంటిదేమీ లేదని 53.5 శాతం మంది చెప్పారు. థియేటర్ల మీద ఎంత క్లారిటీతో ఉన్నారో.. స్కూళ్లకు పిల్లల్ని పంపే విషయంలోనూ అంతే క్లారిటీతో ఉన్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా మీ పిల్లల్ని స్కూళ్లకు పంపుతారా? అంటే.. వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే పంపుతామని 66 శాతం మంది తేల్చేయటం చూస్తే.. వినోదం కావొచ్చు.. పిల్లల స్కూళ్లు కావొచ్చు.. ఏదైనా ఆరోగ్య భద్రత తర్వాతే అన్న భావన సర్వేలో పాల్గొన్న వారిలో కనిపించిందని చెప్పక తప్పదు.