ఐపీఎల్ లో ఫిక్సింగ్ కలకలం?

0

కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో గల్ఫ్ దేశమైన యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. దుబాయ్ లో ఆటగాళ్ల భద్రత కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బయటకు రాకుండా.. వారి వద్దకు ఎవరిని దరిచేరకుండా చూస్తున్నాయి.

అయితే ఇంత కఠినంగా ఉన్నా బుకీలు మాత్రం వారి ప్రయత్నాలు ఆపడం లేదు. ఇటీవల ఓ ఆటగాడిని ఫిక్సింగ్ కోసం బుకీలు సంప్రదించినట్టు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ఆ క్రికెటర్ ను బుకీలు సంప్రదించారని సమాచారం. దీంతో ఆ ఆటగాడు ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేశాడు. దీంతో బీసీసీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.

‘ఓ క్రికెటర్ ను బుకీలు సంప్రదించారని మా దృష్టికి వచ్చింది. అయితే తమ ప్రొటోకాల్ ప్రకారం ఆ క్రికెటర్ ఎవరనే విషయాన్ని మేము వెల్లడించలేం. విచారణ కొనసాగిస్తున్నాం. ఐపీఎల్ జరిగే దుబాయ్ లో బుకీలు ముందే చేరుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ముందుకు సాగనివ్వము’ అని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ తోపాటు స్థానిక పోలీసులతో కూడా కలిసి ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.