మీడియా స్టింగ్ ఆపరేషన్: సరికొత్త దందా బట్టబయలు

0

కొత్త దందా ఒకటి బయటకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు ఉలిక్కిపడేలా చేస్తోంది. ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనతో మొదలయ్యే ఈ గాలం.. చివరకు ఎన్ని చిక్కుల్ని తీసుకొస్తుందన్న విషయాన్ని ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయటకు వచ్చింది. లేడీ డిటెక్టివ్ ఉద్యోగం అంటూ యువతులకు మాత్రమే అంటూ ఎర వేయటం.. అందమైన యువతుల్ని ట్రాప్ లోకి లాగే ఈ దుర్మార్గంపై ఇప్పుడు రాచకొండ పోలీసులు ఫోకస్ పెట్టారు.

అన్నింటికి తెగించాలని.. అర్థరాత్రిళ్లు రమ్మన్నా రావాలని.. పనిలో అదరగొట్టేస్తే.. సినిమాల్లో నటించే అవకాశం కూడా ఉంటుందని చెబుతూ.. యువతుల్ని టార్గెట్ చేసే ఈ దందాకు కర్త.. కర్మ.. క్రియ రామకృష్ణ అనే వ్యక్తిగా తేల్చారు. తానో ప్రముఖ మీడియా సంస్థలో ఉన్నత హోదాలో ఉన్నట్లు చెప్పుకుంటాడు. అంతేకాదు.. డీజీపీ మొదలు పోలీసు బాసులంతా తనకు తెలుసని..ఆ మాటకు వస్తే మంత్రి కేటీఆర్ కూడా క్లోజేనని అతగాడు తియ్యటి మాటలతో ట్రాప్ చేస్తుంటాడు.

సదరు మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా ఇద్దరు యువతుల్ని రామకృష్ణ వద్దకు డిటెక్టివ్ ఉద్యోగాల కోసం పంపగా.. తన విశ్వరూపాన్ని చూపించాడు. రిస్కు ఎంతో ఉంటుందని.. ఏదైనా జరిగే తనకు బాధ్యత లేదంటూనే.. నెలవారీ జీతాల్ని ఇవ్వలేమని.. పని చేసిన రోజులకే డబ్బులు ఇస్తామని చెప్పుకొచ్చాడు.

బుజ్జి అనే వ్యక్తిని పరిచయం చేస్తూ.. అతగాడు సినిమా డైరెక్టర్ అని మహిళలకు పరిచయం చేయగా.. సదరు బుజ్జికి మాత్రం ఆ ఇద్దరు అమ్మాయిలు తన అసిస్టెంట్లు అని.. లేడీ డిటెక్టివ్ లుగా పరిచయం చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అప్పటికి ఆ ఇద్దరు మహిళలు ఇంకా జాబ్ లోకి చేరకపోవటం. ఇంతకీ ఈ బుజ్జి ఎవరన్న విషయాన్ని ఆరా తీస్తే.. రామకృష్ణతో కలిసి అతగాడు మహిళల్ని అలా మోసం చేస్తారని తేల్చారు.

అర్థరాత్రిళ్లు రమ్మన్నా రావాలని.. తానో బేసిక్ ఫోన్.. సిమ్ కార్డు ఇస్తానని.. అర్థరాత్రిళ్లు తాను చెప్పే మగాళ్లకు ఫోన్లు చేసి.. ట్రాప్ చేయాలని చెప్పాడు. అర్థరాత్రిళ్లు తనతో కలిసి పని చేయాలని.. చీరలు.. పంజాబీ డ్రస్ లు కాకుండా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలనే ఇతగాడి లీలలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇతడు ఎవరు? అతగాడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? రామకృష్ణ.. బుజ్జిన బారిన ఎంతమంది మహిళలు పడ్డారు లాంటి అంశాలపై రాచకొండ పోలీసులు ఇప్పుడు నజర్ వేశారు.