భయానకం..23 వేల అడుగుల ఎత్తులో విమానం అద్దం పగిలి ఎగిరిపోయిన పైలట్

0

విమానంలో ప్రయాణమంటేనే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది క్షేమంగా విమానాశ్రయంలో దిగితే పర్వాలేదు. మధ్యలో ఏమైనా జరిగితేనే ప్రాణాలు పైకి పోతాయ్. అందుకే.. విమానం టేకాఫ్ నుంచి మళ్లీ ల్యాండ్ అయ్యేవరకు పైలట్ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. విమానం పైకి ఎగరడానికి ముందే అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒక్కటి తేడా వచ్చినా.. గాల్లో నరకం చూడాలి. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ పైలట్ అలాంటి చేదు అనుభవమే ఎదుర్కొన్నాడు. విమానం 23 అడుగుల ఎత్తులో ఉండగా.. పైలట్ ముందు ఉండే అద్దం (కాక్‌పిట్ విండో) పగిలింది. దీంతో గాలి ఒత్తిడి విమానం నడుపుతున్న పైలట్‌ను ఒక్కసారే బయటకు లాగేసింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలిస్తే.. మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. హాలీవుడ్ సినిమాను తలపించే ఈ ఘటన 1990లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? పైలట్ అంత ఎత్తులో విమాన అద్దం నుంచి బయటకు ఎందుకు వేలాడాడు? అతడు ప్రాణాలతో బయటపడ్డాడా?

పైలట్ ముందు అద్దం పగిలి బయటకి ఎగిరిపోయాడు

ఆ పైలట్ పేరు టిమ్ ల్యాన్‌కాస్టర్. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన టిమ్ ఆ రోజు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్ నుంచి స్పెయిన్‌లోని మలాగాకు విమానం నడుపుతున్నాడు. విమానం.. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు గగనతలంలో సుమారు 22 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. పైలట్లు కుర్చొనే కాక్‌పీట్‌లోని ముందు అద్దం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో గాలి ఒత్తిడికి టిమ్ ఒక్కసారిగా ఆ విండో నుంచి బయటకు విసిరేసినట్లుగా ఎగిరిపోయాడు. అదే సమయంలో కాక్‌పీట్ డోర్ సైతం ఊడిపోయి ప్లైట్ అటెండెంట్ నిగెల్ ఒగ్డేన్‌కు తగిలింది. ఆ దెబ్బకు ఒగ్డెన్ కిందపడిపోయాడు.

పైలట్ కాళ్లను పట్టుకుని..

పరిస్థితిని అర్థం చేసుకున్న ఒగ్డెన్.. కాక్‌పీట్ విండో నుంచి విమానం బయటకు వేళాడుతున్న పైలట్‌ టిమ్‌ను చూసి.. ముందుకు ఉరికాడు. క్షణం ఆలస్యం చేయకుండా టిమ్ కాళ్లను పట్టుకున్నాడు. లేకపోతే.. టిమ్ పూర్తిగా విమానం బయటకు ఎగిరిపోయి 23 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడి చనిపోయేవాడు. అయితే, ఒగ్డెన్ ఎంతో సేపు ఆ పైలట్‌ను పట్టుకోలేకపోయాడు. ఇంతలో క్యాబిన్ సిబ్బందిలో ఒకరైన జాన్ హెవర్డ్.. సైతం అతడికి సాయం చేశాడు. పైలట్ కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. పైలట్ కుర్చీకి ఉండే బెల్టును టిమ్ నడుముకు చుట్టాడు. ఇంతలో ఫ్లైట్ అటెండెంట్ తనని తాను బెల్టుతో పైలట్ సీటుకు కట్టేసుకున్నాడు.

విమానం ల్యాండయ్యే వరకు టెన్షన్.. టెన్షన్..

ఆ సమయంలో పైలట్‌ టిమ్ కాళ్లు మాత్రమే విమానం లోపల ఉన్నాయి. శరీరమంతా విమానం బయట గాల్లోనే ఉంది. అదే సమయంలో కో-పైలట్ అలిస్టైర్ అట్చిన్‌సన్.. కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. ‘మే డే.. మే డే’ అని సందేశం ఇచ్చాడు. కో-పైలట్ ఎంతో చాకచక్యంగా విమానాన్ని సౌత్అంప్టన్ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. అప్పటికే రన్‌వే మీదకు చేరుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన టిమ్‌కు చికిత్స అందించి హాస్పిటల్‌కు తరలించారు. ఆ రోజు జరిగిన అనుభవాన్ని ఒగ్డెన్ మీడియాతో పంచుకున్నాడు.

పైలట్‌ను కోల్పోతాం అనుకున్నాం, కానీ..

ఒగ్డెన్ మాట్లాడుతూ.. ‘‘విండో నుంచి బయటకు వేలాడుతున్న పైలట్ టిమ్ కాళ్లు సీట్ బెల్టులో ఇరుక్కున్నాయి. దాని వల్ల అతడు పూర్తిగా బయటకు పడిపోలేదు. వెంటనే నేను టిమ్ కాళ్లు పట్టుకుని బయటకు లాగాలని ప్రయత్నించా. గాలి ఒత్తిడికి టిమ్ వెనక్కి.. విమానం వైపు వాలిపోయి ఉన్నాడు. అతడి తల విమానాన్ని గుద్దుకుంటోంది. కొంతవరకు టిమ్‌ను లోపలికి లాగగలిగాం. కానీ, ఆ సమయంలో విమానం గంటకు 650 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. గాలి మా కంటే బలంగా టిమ్‌ను బయటకు లాగేస్తోంది. దీంతో టిమ్ నా చేతుల నుంచి జారిపోతారేమో అనిపించింది. అతన్ని కోల్పోతాం అనుకున్నాం. టిమ్ ముక్కు నుంచి రక్తం ధారలా కారడాన్ని చూశాను. తీవ్రమైన గాలి వల్ల టిమ్ కళ్లు పెద్దవిగా సాగిపోతూ.. చాలా భయానకంగా కనిపించాయి. అది నేను ఎప్పటికీ మరిచిపోలేను’’ అని తెలిపాడు.

ఒళ్లంతా గాయాలతో..

ఆ ప్రమాదంలో పైలట్ టిమ్ దాదాపు చావును చూసి వచ్చాడు. అతనికి తీవ్రగాయాలయ్యాయి. అంతర్గత గాయాలతో కొన్నాళ్లు హాస్పిటల్‌లోనే గడపాల్సి వచ్చింది. చివరికి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న టిమ్ ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఈ ఘటనను ‘నేషనల్ జియోగ్రాఫిక్’ చానెల్ 2005లో ‘ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ – బ్లౌ అవుట్’లో ప్రసారం చేశారు. ఆ రోజు జరిగిన ఘటనను రిక్రీయేషన్ చేసి.. ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. తాజాగా డెవిడ్ ఫార్రియెర్ అనే ట్విట్టర్ యూజర్.. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు. దీంతో ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరలవుతున్న ట్వీట్ ఇదే..