Templates by BIGtheme NET
Home >> Telugu News >> కొత్త తరహా ఫీజులతోషాకిస్తున్న స్కూళ్లు

కొత్త తరహా ఫీజులతోషాకిస్తున్న స్కూళ్లు


మహమ్మారి దెబ్బకు మూతబడిన పాఠశాలలు.. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు ఓపెన్ అయ్యాయి. దాదాపు ఏడాది కాలంగా ఇంట్లోనే ఉంటున్న పిల్లలు.. ఆన్ లైన్ క్లాసులకు అలవాటు పడ్డారు. చాలా కాలం తర్వాత పొద్దున్నే పిల్లలు స్కూళ్లకు వెళ్లే సీన్ మళ్లీ కనిపిస్తోంది. ఈ సంతోషం పిల్లల తల్లిదండ్రులకు ఆవిరి అయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి పలు పాఠశాలలు.

కరోనా కారణంగా మూతపడి ఉన్న స్కూళ్లను శుభ్రం చేయటానికి.. అవసరమైన శానిటైజేషన్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాము తీసుకుంటున్న జాగ్రత్తలకు అయ్యే ఖర్చుల్ని ముక్కు పిండి వసూలు చేసేందుకు స్కూళ్ల సిద్ధమవుతున్నాయి.

మామూలు ఫీజులకు.. కరోనా కారణంగా తీసుకునే శానిటైజేషన్ కు ఫీజులు వసూలు చేయటం షురూ చేశాయి. రోజువారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు అదనపు ఖర్చు మీద పడుతుందని.. ఆ భారాన్ని పిల్లల తల్లిదండ్రులు కూడా మోయాలని పాఠశాలలు సెలవిస్తున్నాయి. దీంతో.. స్కూళ్లు తెరిచినంతనే.. బాదుడు మొదలెట్టాయన్న విమర్శ వినిపిస్తోంది. శానిటైజేషన్ చేయటం అన్నది పాఠశాలల కనీస బాధ్యత అని.. దాన్ని కూడా పిల్లల మీద రుద్దాలని ప్రయత్నించటం సరికాదంటున్నారు.

కరోనా పేరుతో వసూలు చేస్తున్న ఫీజులు ఒక్కో పాఠశాలలో ఒక్కోలా ఉండటం గమనార్హం. స్కూల్ స్థాయి.. అందులో చదివే విద్యార్థులకు తగ్గట్లుగా వసూలు చేస్తున్నట్లు చెబతున్నారు. నెలకు రూ.300 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేసే పాఠశాలలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరెన్ని బాదుళ్లకు తెర తీస్తారో?