బ్యాట్ తో బంతిని కొడితే.. రోడ్డు మీద వెళ్లే బస్సును తాకిందే

0

బ్యాట్ పట్టుకొని క్రీజ్ లోకి వస్తే చాలు సిక్సర్లతో బౌలర్లను చీల్చి చెండాడే బ్యాట్స్ మెన్లు కొందరు ఉంటారు. హెలికాఫ్టర్ షాట్ అన్నంతనే ధోనీ గుర్తుకు వస్తే.. సిక్సర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు రోహిత్ శర్మ. బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగి.. బలంగా బంతిని మోదితే చాలు.. నేరుగా వెళ్లి స్టేడియంలోని ప్రేక్షకులు కూర్చున్న ఏదో ఒక చోటుకు దూసుకురావటం మామూలే.

అలాంటి రోహిత్ శర్మ ఐపీఎల్ సాధనలో భాగంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తాజాగా ఒక బంతిని ఆయన బలంగా తాకటం.. అది కాస్తా గాల్లో ఎగిరి స్టేడియం బయట రోడ్డు మీద వెళుతున్న బస్సును తాకటం విశేషం. త్వరలో షురూ కానున్న ఐపీఎల్ సీజన్ లో భాగంగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో ముంబయి ఇండియన్లు పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఒక బంతిని బలంగా మోదిన రోహిత్ శర్మ దెబ్బకు.. స్టేడియం బయట వెళుతున్న బస్సును బంతి తాకటం.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రాక్టీస్ లోనే ఇంత జోరు మీద ఉన్న రోహిత్.. మ్యాచ్ సందర్భంగా మరెన్ని ఆసక్తికర షాట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారో?