తెలంగాణలో డిసెంబరు నుంచి స్కూళ్లు, కాలేజీలు..!

0

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను డిసెంబరు 1 నుంచి పునఃప్రారంభించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తేదీ నుంచే విద్యార్థులకు క్లాస్‌రూమ్‌ బోధన అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలి.. అందుకు ఎలాంటి నిబంధనలు పాటించాలి.. అనే అంశాలపై విద్యాశాఖ అభిప్రాయ సేకరణ చేసింది.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు శ్రీహరి తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలను ప్రారంభించాయని.. మరికొన్ని దీపావళి తర్వాత తెరిచేందుకు తేదీలను ప్రకటించాయని.. ఆయా రాష్ట్రాల్లో అనుభవాలను పరిశీలించి డిసెంబరు 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

మొదట 9, 10 తరగతులు.. వాటితో పాటు ఇంటర్‌ క్లాసులు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. డిసెంబరు ఒకటి నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు మొదలుపెట్టాలని ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిగ్రీ, పీజీ కాలేజీలతో పాటు యూనివర్సిటీలను కూడా డిసెంబ‌రు నుంచి తెరిస్తే మంచిదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి సూచించినట్లు సమాచారం. ఈ అంశాలపై మరోసారి క్షుణ్నంగా చర్చించి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపనున్నారు. అనంతరం సీఎం ఆమోదం లభించాక అధికారిక ప్రకటన వెలువడనుంది.