Southwest Monsoon: దాదాపు రెండు నెలలుగా దంచి కొడుతున్న ఎండలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్ 1న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే ఆదివారం కేరళను తాకాయి. కేరళ వ్యాప్తంగా కారుమబ్బులు కమ్ముకోవడంతో రుతుపవనాలు వచ్చినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మన దేశంలో వ్యవసాయానికి నైతుతి రుతుపవణాలే ప్రధాన ఆధారం. వీటితోనే దేశంలో మూడో వంతు వర్షాలు కురుస్తాయి. ఈ నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే ప్రవేశించాయి. దీంతో దేశ ప్రధాన భూభాగంలో వర్షాకాలం సీజన్ ప్రారంభమైనట్లే..
మూడు రోజులు ముందుగానే..
సాధారణంగా నైరుతి రుతుపవణాలు అండమాన్ మీదుగా కేరళకు చేరుకుంటాయి. ఏటా జూర్ 1న కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈసారి మాత్రం మూడు రోజుల ముందుగానే కేరళను రుతుపవనాలు పలకరించినట్లు వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా నెల రుజులుగా రుతుపవనాల్లో వేగం పెరిగిందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది త్వరగా భారత్‌లోకి ప్రవేశించాయని స్పష్టం చేశారు.
వారం రోజులుగా భిన్న ప్రకటనలు
నిజానికి రుతుపవనాల విషయంలో వారం రోజులుగా భిన్న ప్రకటనలు వెలువడ్డాయి. సాధారణంగా జూన్ 1న కేరళకు చేరాల్సిన రుతుపవనాలు ఈసారి ఐదు రోజుల ముందుగానే వస్తాయని, మే 27లోగా మేఘాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. కానీ రుతుపవనాల రాకకు తగిన పరిస్థితులు లేవని అదే ఐఎండీ గురువారం ప్రకటించింది. అయితే, శుక్రవారం కాస్త మెరుగుదల కనిపించినట్లు తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రంపైన దిగువ స్థాయుల్లో పశ్చిమ గాలులు బలపడ్డాయని, ఉపగ్రహ ఛాయాచిత్రాలనుబట్టి కేరళ తీరం, దాని పరిసరాల్లోని ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆకాశం మేఘావృతమైందని, మరో రెండు, మూడు రోజుల్లో కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం పేర్కొంది. తాజాగా ఆదివారం కేరళ తీరాన్ని తాకి దేశంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది.
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
ఇవాళ కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నిదానంగా ప్రయాణించి, మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో కొద్ది రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గతంలో వెల్లడించింది.