Templates by BIGtheme NET
Home >> Telugu News >> సుశాంత్ బిహారీ నటుడు…రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ

సుశాంత్ బిహారీ నటుడు…రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ


బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుశాంత్ వ్యవహారంలో నెపోటిజం ప్రేమ డ్రగ్స్ వంటి పలుకోణాలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులులుముకుంది. ఓ వైపు ఈ వ్యవహారంలో మహారాష్ట్రలో శివసేన సర్కార్ పై నటి కంగనతో బీజేపీ తీవ్ర విమర్శలు చేయిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ఈ వ్యవహారంలో ప్రాంతీయవాదం కులవాదం వంటి అంశాలు కూడా తెర పైకి వచ్చినట్టు కనిపిస్తోంది. భారతీయ నటుడైన సుశాంత్ ను బిహార్ నటుడిగా ప్రచారం చేసి బీజేపీ రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలనుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. సుశాంత్ మరణాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని ‘జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్’ అంటూ బీజేపీ బిహార్ విభాగం ప్రచారం చేస్తోందని అన్నారు. సుశాంత్ ప్రేయసి నటి రియా చక్రవర్తి పట్ల దర్యాప్తు సంస్థల విచారణ తీరు సరిగా లేదన్న అధీర్ రంజన్ చౌదరి….రియ ా బెంగాలీ బ్రాహ్మణ వర్గానికి చెందిన మహిళ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

సుశాంత్ వ్యవహారంలో పొలిటికల్ మాస్టర్ల మెప్పు పొందేందుకు కేంద్ర సంస్థలు తమ పాత్ర పోషించాయని అధీర్ అన్నారు. అసలైన హంతకుడి కోసం కేంద్ర సంస్థలు వెదుకుతూనే ఉన్నాయని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రియాను ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేయడం మూర్ఖపు చర్య అని రియా తండ్రి దేశానికి సేవ చేసిన మాజీ ఆర్మీ అధికారి అని అన్నారు. సుశాంత్ కేసులో ‘మీడియా విచారణ’ న్యాయ వ్యవస్థకు అరిష్టంగా దాపురిచిందంటూ ట్వీట్ చేశారు. రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్గా ఎన్నికైన అధీర్ వ్యాఖ్యానించడం గమనార్హం. బిహారీ అయిన సుశాంత్ కు న్యాయం జరగాలన్న వాదన బీజేపీ తెరపైకి తెస్తోన్న నేపథ్యంలో బెంగాలీ అయిన రియాకు న్యాయం జరగాలన్న ధోరణిలో అధీర్ మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం రాజకీయ కుల ప్రాంతీయ రంగు పులుముకుందన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.