ఏమిటి ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్..!?

0

ఉద్యోగ నియామకాల్లో సమూల మార్పులు తీసుకొస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక పై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని రకాల ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. అందులో ఉత్తీర్ణత సాధిస్తే మెరిట్ ఆధారంగా ఉన్నత స్థాయి పరీక్షకు ఎంపిక చేసుకుంటారు. ఇప్పటి పరీక్షల విధానం ద్వారా ఉద్యోగ అభ్యర్థులకు ఫీజు ప్రయాణ ఖర్చులు వసతి కోసం ఎంతో ఖర్చు అవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ నియామక సంస్థ (ఎన్ ఆర్ఏ) ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎన్ ఆర్ఏ గ్రూప్ బీ గ్రూప్ సి ఇతర పోస్టులకు అభ్యర్థులను పరీక్షించడానికి షార్ట్ లిస్ట్ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీఈటీ) నిర్వహిస్తుంది. ఎన్ ఆర్ఏలో రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం ఎస్ ఎస్ సీ ఆర్ ఆర్ బీ ఐబీపీఎస్ కు చెందిన ప్రతినిధులు ఉంటారు. ఇకపై ఎస్ ఎస్ సీ ఆర్ ఆర్ బీ ఐబీపీఎస్ ఉద్యోగాలకు వేర్వేరు పరీక్ష నిర్వహించకుండా ఎన్ ఆర్ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్ష గా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీఈటీ) నిర్వహించి స్కోరు కేటాయించడం జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఎన్ ఆర్ఏ కోసం రూ. 1517. 57కోట్లు ఖర్చు చేయనుంది. సీఈటీ పరీక్ష నిర్వహణకు దేశ వ్యాప్తంగా 117 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు నిధులను ఖర్చు చేస్తారు. నూతన విధానం ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టడం.. నిరుద్యోగులకు వరంగా మారింది. ఇప్పటి వరకు వారు ఆర్ ఆర్ బీ ఎస్ ఎస్ సీ ఐబీపీఎస్ వంటి పరీక్షలకు వేరువేరుగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం భారీగా ఫీజులు వెచ్చిస్తున్నారు. పరీక్ష ఉన్నప్పుడల్లా ఏ రాజధాని నగరానికి వెళుతూ ప్రయాణాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు. పరీక్ష కోసం ముందు రోజే వెళ్లాల్సి వుండడంతో బస కోసం గదిని బుక్ చేసుకోవడం ఆహారం ఇతర అవసరాలకు భారీగా ఖర్చు పెట్టు కోవాల్సి వస్తోంది. ఇక యువతులు దివ్యాంగులు అయితే ఎవరినో ఒకరిని తమకు సహాయకంగా పరీక్ష కేంద్రానికి తీసుకు వెళ్లాల్సి వస్తోంది. ఇవన్నీ డబ్బు శ్రమతో కూడుకున్నవే. ఎన్ఆర్ ఏ ఏర్పాటుతో ఈ కష్టాలన్ని తొలగిపోనున్నాయి. కొత్త విధానంలో సీఈటీ నిర్వహించి స్కోర్ కార్డు అందజేస్తారు. ఈ కార్డుకు మూడేళ్లపాటు వ్యాలిడిటీ ఉంటుంది. మధ్యలో పరీక్షలు నిర్వహించినప్పుడు మళ్లీ పరీక్ష రాసి స్కోర్ పెంచుకోవచ్చు. ఎన్ని సార్లు పరీక్ష రాసినా మన అత్యుత్తమ స్కోరునే పరీక్షలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నూతన నియామక విధానంలోని అంశాలివే..

ఎన్ ఆర్ఏ కింద ఒక పరీక్షకు హాజరు కావడం ద్వారా అభ్యర్థులు అనేక పోస్టులకు పోటీపడే అవకాశం దక్కుతుంది. ముందుగా ఎన్ ఆర్ఏ ప్రిలిమినరీ నిర్వహిస్తారు. ఈ పరీక్ష అనేక ఉద్యోగాల ఎంపికకు ఉపయోగపడుతుంది కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ ఏడాదిలో రెండు సార్లపాటు నిర్వహిస్తారు.

ఎస్ ఎస్ సీ ఆర్ ఆర్ బీ ఐబీపీఎస్ వంటి పరీక్షలకు పాఠ్యప్రణాళిక ఒక్కటిగానే ఉంటుంది. పరీక్ష విభిన్న భాషల్లో ఆన్లైన్ ద్వారా రాసుకోవచ్చు. సీఈటీలో స్కోరు మెరుగుపరుచుకునేందుకు ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. గరిష్ట వయో పరిమితి మేరకు పరీక్షలు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ గరిష్ట వయోపరిమితి ప్రస్తుతం ఉన్న విధానంలాగే ఉంటుంది

ప్రిలిమినరీ టెస్టులో అత్యుత్తమ మార్కులు వచ్చిన వారికి ఆర్ ఆర్ బీ ఎస్ ఎస్ సీ ఐబీపీఎస్ వంటి సంస్థలు తదుపరి ఉన్నత స్థాయి పరీక్షను నిర్వహిస్తాయి. ఈ పరీక్షలో అత్యధిక మార్కులు పొందిన వారికి ఉద్యోగాల్లో నియమిస్తారు.

ఆన్లైన్ ద్వారా డిగ్రీ ఇంటర్ పదో తరగతి పాస్ అయిన వారికి వేర్వేరుగా పరీక్షలు ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్షలను నిర్వహిస్తారు.

ఈ విధానం పై ప్రధాని మోదీ మాట్లాడుతూ జాతీయ నియామక సంస్థ ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పద్ధతితో తక్కువ ఖర్చుతో వేగంగా నియామకాలు చేపట్ట దానికి అవకాశం ఏర్పడిందని అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటుతో గ్రామీణ అభ్యర్థులు సైతం పరీక్షలు రాయడానికి ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా అందిన స్కోరు కార్డును పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు కూడా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగులకు ఒక వరమనే భావించాలి.