ట్రంప్ వర్సెస్ బైడెన్… హిందూ అమెరికన్ల ఓట్లు ఎవరికి?

0

అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో ఈ దఫా హిందూ అమెరికన్ల ఓట్లు కీలకం కానున్నాయి. అమెరికాలో ఉన్న హిందూ అమెరికన్లు ఆది నుంచి డెమొక్రాట్ల వైపే నిలుస్తూ వస్తున్నారు. అయితే ఈ దఫా ఇదే పరిస్థితి కొనసాగుతుందా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారగా… ఈ ఓట్ల కోసం ఇటు డెమొక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా ప్రత్యేకంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇతర దేశాల పట్ల ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ఉన్నా… భారత్ పట్ల ఒకింత సానుకూలంగానే ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్న రిపబ్లికన్లు… హిందూ అమెరికన్ల ఓట్లు ఈ సారి తమకేనని ధీమా వ్యక్తం చేస్తుండగా… ఈ వ్యూహాన్ని బద్దలుకొట్టడంతో పాటు ఎప్పుడూ తమ వెంటే వస్తున్న హిందూ అమెరికన్ల ఓట్లు చేజారకుండా డెమొక్రాట్లు కూడా పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు. మొత్తంగా ఈ దఫా అధ్యక్ష ఎన్నికల్లో హిందూ అమెరికన్ల ఓట్ల కోసం ఇటు ట్రంప్ తో పాటు అటు బైడెన్ ల మధ్య బిగ్ ఫైటే నెలకొందన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.

మరో రెండు నెలల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మరోమారు ట్రంప్ బరిలోకి దిగుతుండగా… డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ పోటీకి దిగుతున్నారు. అమెరికాలో విదేశాలకు చెందిన చాలా మంది ఉన్నా… 45 లక్షల మేర భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. వీరిలో హిందూ అమెరికన్ల ఓట్లు ఏకంగా 13 లక్షలకు పైగా ఓట్లున్నాయి. ఈ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ఈ దఫా ట్రంప్ వర్గమే ముందుగా వ్యూహం రచించింది. ‘హిందూ వాయిసెస్ ఫర్ ట్రంప్’ పేరిట గత నెల 14న రిపబ్లికన్లు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆది నుంచి తమవైపే ఉన్న హిందూ అమెరికన్లు… ట్రంప్ వ్యూహంతో ఎక్కడ చేజారిపోతారోనన్న బెంగతో డెమొక్రాట్లు కూడా కొత్తగా ‘హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్’ పేరిట ప్రత్యేక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొత్తంగా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిందూ అమెరికన్ల ఓట్ల కోసం రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైపోయాయన్న మాట.

హౌడీ మోదీ పేరిట అమెరికాలో జరిగిన కార్యక్రమానికి స్వయంగా ట్రంప్ హాజరు కావడం ఆ తర్వాత ఆయన భారత్ లో పర్యటించడం ఎన్నార్సీ కశ్మీర్ అంశాలపై ఏమాత్రం స్పందించకుండా ట్రంప్ వ్యవహరించిన తీరుతో అమెరికాలోని హార్డ్ కోర్ హిందువులంతా ఈ దఫా రిపబ్లికన్ల వైపే మొగ్గాలని యోచిస్తున్నారట. ఇదే విషయాన్ని పసిగట్టిన డెమొక్రాట్లు ఇదే జరిగితే తమ పుట్టి మునుగుతుందన్న భయంతో హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్ పేరిట ప్రత్యేక ప్రచారాన్ని హోరెత్తించేందుకు రంగం సిద్దం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిందూ అమెరికన్ల ఓట్ల కోసం రెండు పార్టీలు రచిస్తున్న వ్యూహాలపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి.