నూతన్ నాయుడి ఇంట్లో అంత దారుణం జరిగిందా?

0

బిగ్ బాస్ తో అందరికి సుపరిచితుడుగా మారిన నూతన్ నాయుడు.. తర్వాతి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వీరాభిమాని కావటంతో ఆయన ఇమేజ్ గ్రాఫ్ మరింత పెరిగింది. పరాన్నజీవి దర్శకుడిగా కొత్త అవతారంతో వార్తల్లోకి వచ్చిన అతడి ఇంట్లో ఒక దళిత యువకుడికి దారుణ పరాభవానికి గురి చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తమ ఇంట్లో పని మానేసిన యువకుడి విషయంలో వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

తమ ఇంట్లో పని మానేసిన దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి నూతన్ నాయుడు సతీమణి మధుప్రియ శిరోముండనం (గుండు కొట్టించిన) చేయించిన వైనం వెలుగు చూసింది. తనకు జరిగిన అవమానాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం బయటకు వచ్చింది. నాలుగు నెలల క్రితం విశాఖలోని పెందుర్తి సమీపంలోని నూతన్ నాయుడి ఇంట్లో కర్రి శ్రీకాంత్ పనికి కుదిరాడు. వ్యక్తిగత కారణాలతో ఆగస్టులో పని మానేశాడు. తాజాగా నూతన్ నాయుడు సతీమణి మధుప్రియ నుంచి శ్రీకాంత్ కు ఫోన్ వచ్చింది. నువ్వు సెల్ ఫోన్ తీశావు.. ఇంటికిరా మాట్లాడాలని పిలిచారు.
నూతన్ కుమార్ నాయుడు ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ ను నిర్బంధించి అతడిపై తప్పుడు ఆరోపణలు చేశారు. స్థానికంగా ఉండే సెలూన్ నిర్వాహకుడు రవిని పిలిపించారు. మధుప్రియ సమక్షంలో శిరోముండనం చేయించారు. ఈ ఉదంతంతో తీవ్ర ఆవేదనకు గురైన శ్రీకాంత్ పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ ఘటనపై తాజాగా విశాఖ సీపీ మనీశ్ కుమార్ సిన్హా స్పందించారు. సమగ్ర విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తనను ఏదైనా చేస్తారన్న భయం ఉందని.. తనకు న్యాయం చేయాలని శ్రీకాంత్ కోరుతున్నారు. ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్న నూతన్ కుమార్ నాయుడుకి తాజా పరిణామం సమస్యల్లో చిక్కుకునేలా చేస్తుందని చెప్పాలి. జరిగిన ఉదంతంపై అతను కానీ.. అతనింటి వారు కానీ స్పందించలేదు.