డ్రగ్స్ కేసులో హీరోయిన్ కస్టడీ పొడిగింపు…!

0

కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ వాడకంపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటు పలువురిని అరెస్టు చేసిన సీసీబీ మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ సంజన ని కూడా అరెస్ట్ చేసారు. నిందితులు ప్రశాంత్ రంకా – రాహుల్ – లూమ్ పెప్పర్ – రవిశంకర్ లను విచారించిన సీసీబీ పోలీసులు ముఖ్య సమాచారాన్ని రాబట్టింది. అయితే రాగిణి మాత్రం విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ఇక ఆధారాలు దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో రాగిణి తన మొబైల్ ఫోన్ లోని మెసేజ్ లను తొలగించింది. అయితే సీసీబీ ఆమె మొబైల్ కు సంబంధించిన డాటాను తిరిగి పొందింది. మరోవైపు రాగిణి కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఆమె ఎక్కడెక్కడకు ప్రయాణించిందో విచారిస్తున్నారు.

ఇదిలా ఉండగా రాగిణి – రవిశంకర్ – వీరేన్ ఖన్నాల కస్టడీ ముగియంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు ఎసీఎంఎం 1వ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచారు. అయితే అనారోగ్యం పేరుతో రాగిణి విచారణకు సహకరించడం లేదని.. మరికొన్ని రోజులు కస్టడీని పొడిగించాలని పోలీసులు జడ్జికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీరిని మరో ఐదు రోజుల పాటు కస్టడీకి అనుతిస్తున్నట్లు కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కాగా శాండల్ వుడ్ డ్రగ్స్ దందా కేసును నిష్పాక్షపాతంగా విచారించాలని.. అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. ఈ కేసుతో డ్రగ్స్ మాఫియా తుడిచిపెట్టుకు పోవాలని హోం మినిస్టర్ బసవరాజ్ బొమ్మై అధికారులను ఆదేశించారు.