అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘మనం’ తరహా మల్టీస్టారర్..?

0

అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కింగ్ నాగార్జున.. వర్సటైల్ యాక్టర్ గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆరు పదుల వయసులో కూడా యువ హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. ఆ తర్వాతి జెనరేషన్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి సుమంత్ – సుప్రియ – సుశాంత్ – నాగచైతన్య – అఖిల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ట్రై చేస్తున్నారు. అలానే కోడళ్ళు అమల – సమంత కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాగ్ – చైతూ – అఖిల్ – సమంత – అమల – సుమంత్ – సుశాంత్ – సుప్రియ.. ఇలా అక్కినేని ఫ్యామిలీ నటీనటుల భాగస్వామ్యంలో ఓ భారీ మల్టీస్టారర్ కి ప్లాన్స్ జరుగుతున్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి ‘మనం’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున – నాగచైతన్య – సమంత కలిసి నటించారు. అఖిల్ – అమల స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ మల్టీస్టారర్ చిరస్థాయిగా నిలిచిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలానే గత కొన్ని రోజులుగా నాగ్ – అఖిల్ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ సినిమా రాబోతోందనే ర్యూమర్ వచ్చింది. ‘చిలసౌ’ ‘మన్మథుడు 2’ చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ అక్కినేని మల్టీస్టారర్ రూపొందనుందట. ఇప్పటికే రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని.. అన్నీ కుదిరితే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.