‘పుష్ప’ బ్యాచ్ గోదావరి ప్రయాణం

0

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న పుష్ప సినిమా షూటింగ్ అనేక కారణాల వల్ల గత ఏడాది నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మార్చిలో సినిమా మొదలు పెట్టాలనుకుంటూ ఉండగా.. కేరళలో ఏర్పాట్లు అన్ని పూర్తి అయిన తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించారు.

షూటింగ్ లకు అనుమతులు వచ్చినా కూడా తక్కువ మందితో షూటింగ్స్ చేసుకోవాలని చెప్పడంతో పాటు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. ఆ కారణంగానే గత ఏడు నెలలుగా పుష్ప సినిమా షూటింగ్ అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెల మొదటి వారంలో మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

పుష్ప సినిమాను మొదట కేరళలోని అడవుల్లో చిత్రీకరించాలనుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ షూటింగ్ సాధ్యం అయ్యేలా లేదు. అందుకే పలు ప్రాంతాలను పరిశీలించి చివరకు గోదావరి జిల్లాల్లో మొదట చిత్రీకరణ పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రంప చోడవరం మరియు మారేడిమిల్లి ప్రాంతాల్లో చిత్రీకరణ కోసం ఏర్పాట్లు చేశారు. రెండు లేదా మూడు వారాల పాటు షూటింగ్ జరిపి అక్కడ నుండి తదుపరి షెడ్యూల్ ను కేరళకు షిప్ట్ చేసే అవకాశం ఉందని మీడియా సర్కిల్స్ ద్వారా తెలుస్తోంది.

అతి త్వరలోనే సినిమా యూనిట్ సభ్యులు అంతా కూడా గోదావరి జిల్లాకు చేరుకోబోతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రను తమిళ స్టార్ నటుడు పోషించబోతున్నాడు. విలన్ గా బాలీవుడ్ నటుడు నటించబోతున్నాడు. ఐటెం సాంగ్ ను కూడా బాలీవుడ్ హీరోయిన్ తో చేయించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు పాటలను అందిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు అన్ని పాటల రికార్డింగ్ పూర్తి అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.