Templates by BIGtheme NET
Home >> Cinema News >> కరోనా సోకినా.. 77ఏళ్ల వయసులో ఎక్కడా తగ్గని బిగ్ బి!

కరోనా సోకినా.. 77ఏళ్ల వయసులో ఎక్కడా తగ్గని బిగ్ బి!


ఆయనో లెజెండ్. 77 వయసులోనూ ఎక్కడా తగ్గడు. ఇప్పటికీ బ్లాగులు రాస్తారు. క్షణం తీరిక లేకుండా నటిస్తూ ఉంటారు. ఆన్ లొకేషన్ వందలాది మందితో పని చేస్తుంటారు. అయినా ఎక్కడా అలసటను దరి చేరనివ్వరు. నీరసం అంటే ఆయనకు తెలీనే తెలీదు. అయితే ఆయనకు దురదృష్ఠ వశాత్తూ యుక్త వయసు నుంచి రకరకాల అనారోగ్యాలు చుట్టు ముట్టాయి. అందులో టీవీ .. లివర్ సిర్రోసిస్ .. లంగ్ ఇన్ఫెక్షన్ లాంటి ప్రమాదకర సమస్యలు ఎదురయ్యాయి. ఇన్ సోమ్నియా(నిదుర లేమి)ని ఎదుర్కొన్నాడు.

అలాంటి కష్టంలోనూ ఆయన ఏనాడూ తల వంచలేదు. అన్నిటినీ ఎదురించి పోరాడాడు. జీవితం అనే పోరాటంలో నెగ్గాడు. కెరీర్ అనే యుద్ధంలో తలవొంచని ధీరుడిలా ఇంతింతై ఎదిగాడు. ఎవ్వర్ గ్రీన్ సూపర్ స్టార్ గా బాలీవుడ్ ప్రపంచానికే పాఠాలు నేర్పించాడు. అంతటి ఘనాపాటికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి తగ్గింది. ముంబై నానా వతి ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆయనెవరో చెప్పాలా? ది గ్రేట్ లెజెండ్ అమితాబ్ బచ్చన్.

ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నారు? కరోనా భయంతో ఇంటికే పరిమితమయ్యారా? అంటే.. అబ్బే.. ఆయన ఎక్కడా తగ్గడు. ఎందులోనూ వెనకడుగు వేయడు. ప్రతిష్ఠాత్మక కేబీసీ 12 సీజన్ కి ఇప్పుడు ఆయనే దేవుడు కానున్నాడు. అప్పుడే తిరిగి షూటింగుకి జాయిన్ అయిపోయాడు. అన్నట్టు ఆయనకు కరోనా ఎక్కడ సోకిందో తెలుసా? ఇదే కేబీసీ కోసం సభ్యుల ఎంపిక జరుగుతున్నప్పుడు వారితో మాట్లాడి కరచాలనం చేసినందుకు వచ్చిందని ఇంతకుముందు ప్రచారమైంది. అయినా ఎక్కడ అంటుకుందో మళ్లీ అక్కడికే వెళ్లి పని చేయడం అంటే ఎంత డేర్ కావాలి? అందుకే ఆయన లెజెండ్. కరోనాని జయించిన వీరుడయ్యాడు. దేనికీ తలవొంచని కమిట్ మెంట్ కి మాత్రమే నిబద్ధుడై పని చేసేవాడని నిరూపించుకుంటున్నాడు. కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) తనకు పునర్జన్మనిచ్చిన విషయాన్ని ఆయన ఏనాడూ మరువడు. ఆయన సాహసానికి తగ్గట్టే ఈసారి ఎలాంటి సమస్యా రాకుండా కేబీసీ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.