మరో రికార్డ్ క్రియేట్ చేసిన ‘రౌడీ బేబీ’..!

0

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – సాయిపల్లవి జంటగా నటించిన ‘మారి 2’ సినిమా కమర్షియల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్టు అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు ఆడియోకి అటు వీడియోకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాటని ధనుష్ మరియ ఢీ ఆలపించారు. దీనికి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కోరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ లో ధనుష్ – సాయి పల్లవి ఎనర్జిటిక్ స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే అనేక రికార్డ్స్ క్రియేట్ చేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ తాజాగా మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది.

సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ సాంగ్ గా రికార్డు కెక్కింది. 2019 జనవరి 2న యూట్యూబ్ లో విడుదల చేసిన ‘రౌడీ బేబీ’ పాట 1 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ అరుదైన రికార్డు సృష్టించిన సందర్భంగా హీరో ధనుష్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. ”కొలవెరిడీ సాంగ్ 9వ వార్షికోత్సవం రోజు ‘రౌడీ బేబీ’ 1 బిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 1 బిలియన్ వీక్షణలను చేరుకున్న మొట్టమొదటి దక్షిణ భారత సాంగ్ ఇదే అవడం మేము గౌరవంగా భావిస్తున్నాం. మా టీమ్ మొత్తం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతోంది” అని ధనుష్ ట్వీట్ చేశాడు. ధనుష్ పాడిన ‘కొలవెరిడీ’ సాంగ్ కూడా అనేక రికార్డ్స్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.