ఈ విషయంలో తాప్సిని అభినందించకుండా ఉండలేం

0

సౌత్ హీరోయిన్స్ ఎక్కువ శాతం మంది బాలీవుడ్ ఆఫర్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నా కూడా ఉత్తరాది నుండి పిలుపు కోసం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎదురు చూస్తూ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది హీరోయిన్స్ సౌత్ నుండి వెళ్లి బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్స్ సౌత్ సినిమాలపై పెద్దగా ఆసక్తిని కనబర్చరు. చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే సౌత్ సినిమాల్లో కనిపించేందుకు వారు ఓకే చెప్తారు. కాని బాలీవుడ్ లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న తాప్సి మాత్రం సౌత్ సినిమాలను వరుసగా చేయాలని ఆశ పడుతుంది.

బాలీవుడ్ లో తాను ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి ఏడాదికి కనీసం ఒక్క సౌత్ సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నట్లుగా తాజాగా తాప్సి పేర్కొంది. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో అయిదు సినిమాలు చేస్తోంది. అయినా కూడా ఈమె సౌత్ నుండి వచ్చే కథలను వింటూనే ఉందట. తనకు సినీ కెరీర్ ను ఇచ్చింది కనుక సౌత్ సినీ పరిశ్రమను వీడను అంటోంది.

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ సౌత్ లో కూడా సినిమాలను చేసేందుకు ఆమె ముందుకు రావడం నిజంగా గొప్ప విషయం. సౌత్ లో ఆమె ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. బాలీవుడ్ ప్రేక్షకులు మేకర్స్ ఆమె ప్రతిభకు పట్టం కట్టారు. అయినా కూడా సౌత్ ప్రేక్షకులపై సౌత్ సినిమాపై ఆసక్తిని తాప్సి కనబర్చడం నిజంగా అభినందనీయం. ఈ విషయంలో ఆమెను ఖచ్చితంగా అభినందించాల్సిందే అంటూ తాప్సి అభిమానులు అంటున్నారు.