కథతో పవన్ వద్దకు వెళ్లబోతున్న బండ్ల

0

కొన్ని వారాల క్రితం పవన్ కళ్యాణ్ తన బ్యానర్ లో మరో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున పూర్తి చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. అందుకే ఈ జోష్ లోనే పవన్ తో మూవీ చేసేయాలనే నిర్ణయానికి బండ్ల గణేష్ వచ్చాడు. అందుకే పలువురి రచయితలను పట్టుకుని పవన్ కోసం కథ రెడీ చేయించాడు. ఒక యంగ్ డైరెక్టర్ కమ్ రైటర్ చెప్పిన కథ బండ్ల గణేష్ కు నచ్చడంతో ఆ కథను పవన్ వద్దకు తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ ఎలాంటి కథకు అయినా ఓకే చెబుతున్నాడు అంటూ ఒక టాక్ ఉంది. తక్కువ సమయంలో సినిమా పూర్తి అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేస్తే తప్పకుండా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అంటున్నారు. అందుకే బండ్ల గణేష్ ఆ విధంగా ఒక కథను రెడీ చేయించాడట. త్వరలోనే పవన్ కు ఆ కథను వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఆ దర్శకుడు ఎవరు అనే విషయంలో ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే మొన్నటి వరకు ప్రచారం జరిగినట్లుగా పూరి జగన్నాథ్ మాత్రం కాదని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బండ్ల గణేష్ గోవిందుడు అందరి వాడేలే సినిమా తర్వాత నిర్మాణంకు దూరం అయ్యాడు. ఒకటి రెండు ప్రాజెక్ట్ లు సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా కార్యరూపం దాల్చలేదు. మళ్లీ పవన్ నుండి ఛాన్స్ దక్కించుకున్నబండ్ల గణేష్ మరోసారి నిర్మాతగా ఈ సినిమాతో బిజీ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే పవన్ అరడజనుకు పైగా సినిమాలకు కమిట్ అయ్యాడు. వాటి తర్వాత బండ్ల గణేష్ మూవీ చేసే అవకాశం ఉంది. కనుక పవన్.. బండ్ల కాంబో మూవీ 2021లో పట్టాలెక్కే అవకాశం ఉంది అంటున్నారు.