రాజమౌళికి బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..!

0

దర్శకధీరుడు రాజమౌళి తెలంగాణ విప్లవవీరుడు కొమురం భీమ్ – మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. కొమురం భీమ్ గా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఇంట్రో వీడియోని కొమరం భీమ్ జయంతి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ‘కొమురం భీమ్’ ని పరిచయం చేస్తూ వచ్చిన ‘రామరాజు ఫర్ భీమ్’ కి విశేష స్పందన వచ్చింది. అలానే దీనిపై వివాదం కూడా చెలరేగింది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన రాజమౌళి.. చివర్లలో తారక్ ని టోపీ ధరించిన మరో సామాజిక వర్గ యువకుడిగా చూపించడంపై ఓ వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కొమరం భీమ్ జల్ – జంగల్ – జమీన్ నినాదంతో నిజాం పాలనకి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని.. చరిత్రను వక్రీకరించి భీమ్ కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎంపీ సోయం బాపు రావు దర్శకుడు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో కొమురం భీమ్ పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలని సోయం బాపు రావు డిమాండ్ చేసారు. ఒకవేళ సినిమాని అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. సినిమా కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని సోయం బాపు అన్నారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని.. భీమ్ ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని ఎంపీ అన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని.. లేకుంటే మర్యాదగా ఉండదని ఎంపీ సోయం బాపు రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకముందు కొమరం భీమ్ మనవడు సోన్ రావు కూడా నిరసన వ్యక్తం చేసారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు లేదా చిత్రీకరణ సమయంలో రాజమౌళి కానీ దానయ్య కానీ.. కొమరం భీమ్ కుటుంబ సభ్యులతో సంప్రదించలేదని.. టీజర్ నుండి ఆ షాట్ ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై రాజమౌళి లేదా ఆర్.ఆర్.ఆర్ బృందం ఎలా స్పందిస్తారో చూడాలి.