డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్…!

0

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తికి బెయిల్ లభించింది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో అతని గర్ల్ ఫ్రెండ్ రియాని మరియు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రియా మరియు షోవిక్ బెయిల్ పిటిషన్ ని తిరస్కరిస్తూ ప్రత్యేక ఎన్డిపిఎస్ న్యాయస్థానం వారి కస్టడీని అక్టోబర్ 20 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో రియా ఆమె సోదరుడు షోవిక్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

కాగా బాంబే హైకోర్టు రియా పిటిషన్ ని పరిశీలించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె సోదరుడి బెయిల్ పిటిషన్ మాత్రం తిరస్కరించింది. డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టు అయిన రియాకు దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్ లభించింది. జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. దీంతో ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగి సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా సెప్టెంబర్ 8న ఆమెను అరెస్ట్ చేశారు.