ఎస్పీ బాలు స్మారక మందిరం అక్కడేనట?

0

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. ఇప్పటికీ సినీ రాజకీయవర్గాల్లో అదొక విషాదకర వార్తగా మిగిలిపోయింది. అంత గొప్ప గాన గంధర్వుడికి స్మారక మందిరం నిర్మించాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది.

దీనిపై ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించాడు. నాన్న బాలును ఖననం చేసిన ప్రాంతంలోనే స్మారక మందిరం త్వరలో నిర్మిస్తామని కుమారుడు చరణ్ ఆదివారం మీడియాకు తెలిపారు.

ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు శనివారం తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఖననం చేసిన ప్రాంతంలోనే ఆదివారం కుటుంబ సభ్యులు సంప్రదాయ ఆచారాలను పూర్తి చేసి పూజలు చేశారు. ఇక్కడే ఎస్పీ బాలు స్మారక మందిరం నిర్మించనున్నట్లు ఎస్పీ చరణ్ వెల్లడించారు.

ఎస్పీ బాలుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వివరిస్తామని ఎస్పీ చరణ్ తెలిపారు. తండ్రికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన తమిళనాడు ప్రభుత్వానికి సహకరించిన పోలీసులు మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు సందర్శించేలా ఈ స్మారక మందిరం నిర్మిస్తామని వివరించారు..