చరణ్ విలన్ ఇప్పుడు మహేష్ కి విలన్?

0

మిస్టర్ పెర్ఫెక్ట్ అరవింద స్వామి ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. బొంబాయి సినిమాలో మణిరత్నం ఆయనను లవర్ బోయ్ గా చూపించారు. చాలా కాలం తర్వాత మణి సర్ బతిమాలితేనే తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారని చెబుతారు. ఇక రీఎంట్రీలో స్వామి వరుసగా విలన్ పాత్రలు చేస్తూ వేడెక్కిస్తున్నారు. ఇంతకుముందు `నవాబ్` చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న రియలిస్టిక్ పాత్రతో మెప్పించాడు అరవింద స్వామి.

అంతకంటే ముందే `తని ఒరువన్`లో జయం రవికి విలన్ గా మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్స్ తో కట్టి పడేశారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా విలన్ గా నటించారు అరవింద స్వామి. క్లాస్ విలన్ గా అద్భుత నటనతో రక్తి కట్టించడం తనకే చెల్లిందని ఆ మూడు చిత్రాలతో ప్రూవ్ చేశారు. మణిరత్నం తదుపరి చిత్రాల్లోనూ ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇంతేనా.. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సోషల్ డ్రామా `సర్కారు వారి పాట`లో అరవిందస్వామి ఓ కీలక పాత్రలో నటించేందుకు అంగీకరించారట. నవంబర్ ఒకటి నుండి అమెరికాలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే అరవింద స్వామి ఏ తరహా పాత్రలో నటిస్తారు? అంటే విలన్ గానే నటిస్తాడని ప్రచారమవుతోంది.

నిజానికి ఈ మూవీలో శాండల్ వుడ్ స్టార్ హీరో ఉపేంద్ర విలన్ పాత్రలో నటిస్తారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. కానీ ఆయన స్థానంలో అరవింద్ స్వామిని రీప్లేస్ చేస్తున్నారా? అన్నది మేకర్స్ వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రధాన విలన్ పాత్ర కోసం స్వామితో చర్చలు జరుపుతున్నారు. దేనికైనా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా.. పరశురాం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ – జీఎంబీ బ్యానర్లు -14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు.