Templates by BIGtheme NET
Home >> Cinema News >> లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా…!

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా…!


కరోనా మహమ్మారి కారణంగా ఆరున్నర నెలలుగా మూతబడి ఉన్న థియేటర్స్.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 5.0 నిబంధనల్లో భాగంగా థియేటర్లు మరియు మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోడానికి అనుమతినిస్తూ.. 50 శాతం సీట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది. దీంతో నిబంధనలకు తగ్గట్టు థియేటర్స్ ని రీ ఓపెన్ చేయడానికి సన్నాహకాలు ప్రారంభించారు. అయితే ముందుగా ఏ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు అని సినీ ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికంటే నేనే ముందు వస్తున్నా అంటూ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాని రిలీజ్ చేస్తానంటూ ప్రకటించాడు.

కరోనా లాక్ డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలు తీసి వాటిని ఏటీటీల ద్వారా రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించాడు వర్మ. అదే సమయంలో ‘కరోనా వైరస్’ అనే సినిమా రూపొందించాడు. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. వర్మ క్రియేట్ చేసిన ‘కరోనా వైరస్’ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు మరియు ‘దేవుడా నీకో దండం రా’ సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే అక్టోబర్ 15 తర్వాత థియేటర్స్ ఓపెన్ చేస్తుండటంతో ‘కరోనా వైరస్’ను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు వర్మ. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ ”మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమాగా ‘కరోనా వైరస్’ నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అని వర్మ ట్వీట్ చేశాడు. కరోనా వైరస్ కారణంగా మూసుకుపోయిన థియేటర్స్ ని ‘కరోనా వైరస్’ సినిమాతో ప్రారంభిస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.