Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స

‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స


ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు యావత్ ప్రేక్షక లోకాన్ని కలవరపెడుతున్నాయి. నటీనటుల అకాల మరణాలతో పాటు మంచి భవిష్యత్ ఉన్న యాక్టర్స్ ఆత్మహత్యలు, కరోనా కాటు లాంటి ఊహించని పరిణామాలతో సినీ లోకం ఉలిక్కిపడుతోంది. నిన్న (మంగళవారం) టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త నుంచి తేరుకోకముందే నేటి ఉదయమే మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో అంతా షాకయ్యారు. ఇంతలోనే ‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మ బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరిందనే మరో విషాదకర వార్త బయటకొచ్చింది.

బాలీవుడ్ సీనియర్ నటి, చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సురేఖా సిక్రి. ప్రస్తుతం ఈమె వయసు 75 సంవత్సరాలు. నిన్న మంగ‌ళ‌వారం అనారోగ్యం పాలైన ఆమెకు రాత్రి సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో వెంటనే ముంబై లోని క్రిటికేర్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్‌ రావడం ఇది రెండోసారి అని కుటుంబ సభ్యులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది సురేఖా సిక్రి. చివరగా ఆమె నెట్‌ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్‌’లో జాన్వీ కపూర్‌తో కలిసి నటించింది. ‘తమస్’ (1988), ‘మమ్మో’ (1995), ‘బధాయి హో’ (2018) సినిమాల్లో తన నటనకు గాను జాతీయ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకుంది సురేఖా సిక్రి.