అక్కినేని హీరో బాధ్యత మెగా ఫ్యామిలీ తీసుకుందా…?

0

అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అఖిల్. తన ఫస్ట్ మూవీ ‘అఖిల్’ పరాజయం పాలైనప్పటి నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. ఆకట్టుకునే అందం.. ఆడియన్స్ ని మెప్పించగల అభినయం.. అన్నీ ఉన్నా అక్కినేని అఖిల్ కి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో తనయుడి కెరీర్ మీద ఫోకస్ పెట్టిన నాగార్జున.. అఖిల్ ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతిలో పెట్టాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమాని పట్టాలెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ అయినా అఖిల్ ని మాస్ హీరోగా నిలబెట్టాలనే నాగ్ కోరిక మాత్రం నెరవేరదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అఖిల్ బాధ్యత మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ తీసుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

అక్కినేని ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందనే విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న నాగ్ – చిరు ఇద్దరూ సోదరభావంతో మెలుగుతూ ఉంటారు. ఇద్దరూ కలిసి పలు వ్యాపారాల్లోనూ భాగస్వాములుగా ఉన్నారు. ఈ క్రమంలో అఖిల్ – రామ్ చరణ్ కు మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే చిరంజీవిని అఖిల్ ‘పెదనాన్న’ అని సంబోధిస్తూ చరణ్ ని ‘అన్నయ్య’ గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి సైతం ఓ సందర్భంలో ‘అఖిల్ ఇంట్లో తిరుగుతూ ఉంటే మాకు ఇలాంటి మరో కొడుకు ఉంటే బాగుండు’ అని అనుకుంటూ ఉంటామని చెప్పుకొచ్చాడు. వీరి మధ్య ఇలాంటి రిలేషన్ షిప్ ఉన్న నేపథ్యంలో అఖిల్ ని హీరోగా నిలబెట్టాలని అతని బాధ్యత చిరు – చరణ్ తీసుకున్నారని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఎలా అయినా అఖిల్ ని నిలబెట్టాలని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన రామ్ చరణ్.. తన కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ ని అఖిల్ తో తీసేలా ప్లాన్ చేసాడని వార్తలు వస్తున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చరణ్ తో ‘ధ్రువ’.. చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘సైరా’ వంటి పాన్ ఇండియా మూవీ తరువాత అదే రేంజ్ లో చరణ్ కోసం ఓ స్టోరీ రెడీ చేశారట. అయితే చరణ్ కి ఈ స్టోరీ నచ్చినప్పటికీ అఖిల్ తో చేయమని రిక్వెస్ట్ చేశాడట. దీంతో సురేందర్ రెడ్డి చరణ్ కోసం రెడీ చేసిన స్పై థ్రిల్లర్ స్టోరీని అఖిల్ తో తీస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇటీవల సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. చరణ్ సెట్ చేసిన స్టోరీతో అఖిల్ కి సూపర్ సక్సెస్ వచ్చి మెగా బాధ్యత నెరవేర్చుకుంటారేమో చూడాలి.