ఇటీవల ఓటీటీలో విడుదలైన థ్రిల్లర్స్ లో బెస్ట్ అనిపించుకున్న ‘గతం’

0

కరోనా నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా థియేటర్స్ మూతపడటంతో సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వేదికగా విడుదల అవుతున్నాయి. చిన్న మీడియం రేంజ్ సినిమాలు అనేకం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కీర్తి సురేష్ ‘పెంగ్విన్’.. అనుష్క ‘నిశబ్దం’.. నాని ‘వి’ వంటి క్రేజీ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ఓటీటీలలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం ఆడియన్స్ ని నిరాశపరచగా ఒకటీ రెండు విశేష ఆదరణ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ”గతం” అనే సైకలాజికల్ థ్రిల్లర్ నిన్న(నవంబర్ 6) డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైంది. చిన్న సినిమాగా వచ్చిన ‘గతం’ ఓటీటీ ఆడియన్స్ ని విమర్శకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంటోంది.

‘గతం’ కథ విషయానికొస్తే అమెరికాలో యాక్సిడెంట్ కారణంగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకొని లేచిన వ్యక్తి తన గతాన్ని మర్చిపోతాడు. అతని గర్ల్ ఫ్రెండ్ సహాయంతో తండ్రి దగ్గరకు చేరే క్రమంలో వారికి ఎదురైన అనుకోని సంఘటనలే ఈ సినిమా స్టోరీ. భార్గవ పోలుదాసు – రాకేశ్ గలేభే – పూజిత కురపర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా విజువల్స్ మరియు సౌండింగ్.. ఇలా అన్ని క్రాఫ్ట్స్ చాలా బాగున్నాయి. విభిన్నమైన కాన్సెప్ట్ తో రివర్స్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ చిత్రానికి కిరణ్ కొండమడుగుల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అమెరికాలో ఉన్న కొందరు ఔత్సాహిక సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు క్రౌడ్ ఫండింగ్ తో ఎస్ ఒరిజినల్స్ మరియు ఆఫ్ బీట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై రూపొందించారు. అమెరికాలో చిత్రీకరించబడిన ‘గతం’ సినిమా విజువల్స్.. ఇది హాలీవుడ్ మూవీ ఏమో అనుకునే విధంగా ఉన్నాయి. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం మరియు మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. తక్కువ నిడివి గల ఈ సినిమా ట్విస్టులు టర్న్ లతో ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి టాక్ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.