Templates by BIGtheme NET
Home >> Cinema News >> అలాంటి వ్యక్తికి అవార్డ్ ఎలా ఇస్తారు?: మలయాళ హీరోయిన్లు

అలాంటి వ్యక్తికి అవార్డ్ ఎలా ఇస్తారు?: మలయాళ హీరోయిన్లు


తమిళ కవి సినీ గేయ రచయిత వైరముత్తు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2018 మీటూ ఉద్యమ సమయంలో వైరముత్తు పై గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తోపాటు మరో పదహారు మంది తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే వీటిపై నిజాలు నిగ్గు తేలకముందే కేరళ ఒఎన్వీ గురువ్ జాతీయ సాహితీ పురస్కారాన్ని వైరముత్తుకు ప్రకటించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనికి ఈసారి మాలీవుడ్ నటీమణులు కూడా గొంతు కలిపారు.

వైరముత్తు పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎటూ తేలకముందే.. ఓఎన్వీ అవార్డు ఇవ్వడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అర్హత లేని వ్యక్తి నుంచి అవార్డును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ లో మలయాళ నటి పార్వతి తిరువొతు – గీతూ మోహన్ దాస్ – రీమా కళింగల్ తో పాటు చిన్మయి కూడా పాల్గొన్నారు.

వైరముత్తు కు అవార్డ్ ప్రకటించడంపై వస్తున్న విమర్శలపై ఒఎన్వీ కల్చరల్ అకాడమీ ప్రెసిడెంట్ అదూర్ గోపాలకృష్ణన్ స్పందించారు. ఈ పురస్కారం ప్రతిభ ఆధారంగా ఇచ్చిందే తప్ప.. క్యారెక్టర్ చూసి కాదని అన్నారు. వైరముత్తు పై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే.. ఈరోజుల్లో ఎవరు ఎవరిపైనైనా ఆరోపణలు చేయొచ్చని పేర్కొన్నారు. వైరముత్తు మంచి గేయ రచయిత.. జ్యూరీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని గోపాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఇకపోతే దివంగత మలయాళ కవి సినీ గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో ఇచ్చే ఈ జాతీయ సాహితీ అవార్డును ఈసారి రాష్ట్రేతర వ్యక్తి అయిన వైరముత్తుకు ఇవ్వడం గమనార్హం. ఇక ఓఎన్వీ గురుప్ అవార్డు అందుకున్న వైరముత్తును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందించారు.

ఇదిలా ఉంటే.. వైరముత్తు భాగమైన ‘నాట్పదు తెరల్’ ప్రాజెక్ట్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. వంద పాటల ఈ ప్రాజెక్టులో ఆయన రాసిన ‘ఎన్ కాదలా’ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో ‘విశ్వాసం’ ఫేమ్ అనైక నటించింది. తనకంటే రెట్టింపు వయసున్న ఓ మధ్య వయస్కుడిని చూసి పదహారేళ్ల అమ్మాయి ఆకర్షితురాలై ప్రేమలో పడే కాన్సెప్ట్ తో ఈ పాట రూపొందించారు. అందులోనూ ఆమె ప్రేమించేది ఓ కవిని కావడంతో నెటిజన్స్.. వైరముత్తు వ్యక్తిగత జీవితంతో ముడి పెడుతూ కామెంట్స్ పెడుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వైరముత్తు.. తన ఆలోచనలను ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడని ట్రోల్ చేస్తున్నారు.