డబ్బులే లేవన్న రియా అంత లాయర్ ఫీజ్ ఎలా చెల్లిస్తుంది

0

సుశాంత్ ఇష్యూలో కంగనా రనౌత్ మొదటి నుండి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ కేసులో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులకు సంబంధం ఉందంటూ ఆమె బలంగా వాదిస్తూ వస్తుంది. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం మాఫియా కారణంగానే సుశాంత్ చనిపోయాడని ఆరోపించింది. సుశాంత్ చనిపోయినప్పటి నుండి ఆమె సోషల్ మీడియాలో మరియు జాతీయ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా ఆమె రియా చక్రవర్తిపై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.

తాను ఇప్పటి వరకు ఎన్నో కేసులు ఎదుర్కొన్నాను. ఆ కేసుల కోసం లాయర్ లను సమకూర్చుకోవడం ఎంత కష్టమైన పనో నాకు తెలుసు. ఎంత ఖర్చుతో కూడుకున్నదో కూడా నాకు తెలుసు. అలాంటిది అంత తక్కువ సమయంలో సుశాంత్ కేసులో రియాకు సతీష్ వంటి పెద్ద లాయర్ ఎలా లభించాడు. ఇటీవల ఆమె తన వద్ద డబ్బులు లేవు అంటూ వ్యాఖ్యలు చేసింది. మరి సతీష్ వంటి పెద్ద లాయర్ కు ఆమె ఎలా అంత ఫీజు చెల్లిస్తుంది అంటూ కంగనా ప్రశ్నించింది.

ఈ కేసులో ఆమె వెనుక పెద్ద వారు ఉన్నారు అనేందుకు ఇదే సాక్ష్యం అంటూ కంగనా చెప్పుకొచ్చింది. ఈ విషయంలో రియా చక్రవర్తి పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇటీవలే ఈడీ కూడా ఈ కేసులో ఆమెను విచారించడం జరిగింది. ఇప్పుడు సీబీఐ కూడా ఆమెను విచారించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు రియా నుండి సీబీఐ సమాధానాలు రాబడుతుందని ఆశిస్తున్నారు. కంగనా గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ కేసుకు సంబంధించి తన వద్ద కీలక సమాచారం ఉందని చెప్పింది. కనుక సీబీఐ వారు కంగనాను కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు.