Templates by BIGtheme NET
Home >> Cinema News >> వైఎస్సార్ – సీబీఎన్ స్నేహంపై దేవా కట్ట ‘ఇంద్రప్రస్థం’!!

వైఎస్సార్ – సీబీఎన్ స్నేహంపై దేవా కట్ట ‘ఇంద్రప్రస్థం’!!


”ప్రస్థానం” సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ దేవా కట్టా మరో సంచలనానికి తెరలేపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్య స్నేహం మరియు రాజకీయ వైరం ఆధారంగా ఓ ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్ తీయబోతున్నట్టు ఇటీవల దేవా కట్ట ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి ”ఇంద్రప్రస్థం” అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ తో మోషన్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పొలిటికల్ ఐకాన్స్ నుండి ప్రేరణ పొంది ”నైతికత మారుతుంది.. కానీ పవర్ కోసం జరిగే యుద్ధం స్థిరంగా ఉంటుంది” అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దేవా కట్ట ప్రకటించారు.

‘ఇంద్రప్రస్థం’ మోషన్ పోస్టర్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు నారా చంద్రబాబు నాయుడు తమశైలిలో అభివాదం చేస్తున్న షాడో ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ”ప్రపంచంలో జరిగే పోటీలన్నిటికీ పర్పస్ ఒక్కటే.. విన్నర్స్ ని ఎంచుకోవడం.. విన్నర్స్ రన్ ది వరల్డ్.. ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే.. ఆ ఆటకున్న కిక్కే వేరు” అని దేవా కట్ట చెప్పిన డైలాగ్ ఈ సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రాన్ని ప్రోడోస్ ప్రొడక్షన్ బ్యానర్ పై హర్ష. వి మరియు తేజ. సి కలిసి నిర్మిస్తున్నారు.

కాగా ఇటీవల వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి – నారా చంద్రబాబు మధ్య ఉన్న స్నేహాన్ని మరియు రాజకీయ వైరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓ ఫిక్షనల్ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు డైరెక్టర్ రాజ్ ప్రకటించాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను విష్ణు ఇందూరి నిర్మించబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దేవకట్టా నేను ఆల్రెడీ రిజిస్టర్ చేయించిన స్టోరీలో ఫిక్షనల్ ఐడియాలని నిర్మాత విష్ణు ఇందూరి దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది జరిగిన రెండు రోజులకే ఆ నిర్మాత కంటే ముందే తన ఐడియాను మోషన్ పోస్టర్ రూపంలో తీసుకొచ్చారు దేవకట్టా. సాయి ధరమ్ తేజ్ తో ప్రస్తుతం దేవా కట్ట రూపొందిస్తున్న సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.