రాజకీయాల పై ఎన్టీఆర్ ఫోకస్ నిజమా?

0

తారక్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల చరణ్-తారక్ జోడీపై రాజమౌళి కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. చిన్న గ్యాప్ లో తారక్ దుబాయ్ ట్రిప్ వెళ్లే పనిలో ఉన్నారని కథనాలొచ్చాయి. ఇక అట్నుంచి తిరిగొచ్చాక ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ చిత్రీకరణలు ముగించి త్రివిక్రమ్ కోసం సిద్ధం కావాల్సి ఉంటుంది. డిసెంబర్ నాటికి పాన్ ఇండియా మూవీ కమిట్ మెంట్ పూర్తవుతుందని కూడా చెబుతున్నారు.

నిజానికి త్రివిక్రమ్ తో మూవీని తారక్ ఈ పాటికే పూర్తి చేసి 2021 మార్చిలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ అది అస్సలు కుదరలేదు. మహమ్మారీ దెబ్బకు షెడ్యూల్స్ అన్నీ తారుమారు అయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ఆలస్యం అవ్వడం కూడా త్రివిక్రమ్ తో మూవీపై ప్రభావం చూపించింది.

తాజా సమాచారం ప్రకారం మార్చి 2021లో ఎన్టీఆర్ 30ని ప్రారంభించి దసరా నాటికి (అక్టోబర్ లో) రిలీజ్ చేయాలన్న ప్లాన్ కి తారక్ – త్రివిక్రమ్ బృందం షిఫ్టయ్యారని తెలుస్తోంది. అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ ని ఎలా చూపించాలి? అన్నదానిపైనా త్రివిక్రమ్ గట్టిగానే కసరత్తు చేశారట. ప్రస్తుతం స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. తనదైన మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మిస్ కాకుండా స్క్రిప్టులో రాజకీయాల్ని హైలైట్ చేయనున్నారని తాజాగా కథనాలొస్తున్నాయి.

నిజానికి అరవింద సమేత లాంటి యాక్షన్ ఫ్యాక్షన్ సినిమా కోసం ఆ ఇద్దరూ కలిసి పని చేశారు. కానీ ఈసారి అలా కాకుండా తారక్ ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కామిక్ టచ్ మిస్ కాకుండా చూపించాలన్నది త్రివిక్రమ్ ప్లాన్. అయితే రాజకీయాలు అనే ఎలిమెంట్ అంతే పవర్ ఫుల్ గా డ్రైవ్ చేసేలా కథను తీర్చిదిద్దుతున్నారట. తారక్ కి రియాలిటీలో రాజకీయ నేపథ్యం ఉన్నా ఇటీవల వాటన్నిటికీ దూరంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు పొలిటికల్ ఎలిమెంట్ అంటే పర్సనల్ లైఫ్ విషయాల్ని యాడ్ చేస్తారా? అన్నది ఆసక్తిని పెంచుతోంది. రాబోవు ఎన్నికల నాటికి తారక్ క్యాంపెయినింగ్ కి వెళ్లే ఛాన్సుందా? లేక ఇంతకుముందు లానే అతడు రాజకీయాలకు దూరంగానే ఉంటారా? అన్నది కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చే వీలుందని భావిస్తున్నారు.