ఆమెతో స్నేహమే రకుల్ కొంప ముంచిందా…? NDPS చట్టం ప్రకారం అరెస్ట్ తప్పదా…?

0

బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు దర్యాప్తును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నిన్న (శుక్రవారం) విచారించింది. విచారణలో భాగంగా రకుల్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ఎన్సీబీ అధికారులు.. ఆమెను 4 గంటల పాటు విచారించారు. ఈ క్రమంలో రియా చక్రవర్తితో పరిచయం గురించి.. సుశాంత్ పార్టీల గురించి.. రియాతో వాట్సప్ చాటింగ్ వంటి అంశాలపై రకుల్ ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. రకుల్ ఎన్సీబీకి పలు కీలక విషయాలను వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రియా చక్రవర్తితో తాను డ్రగ్ చాట్ చేసినట్లు రకుల్ అంగీకరించిందని.. రియా కోరిన మేరకు తన ఫ్లాట్లో డ్రగ్స్ దాచినట్టు రకుల్ అంగీకరించిందని.. అయితే తనకు డ్రగ్స్ లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని.. తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని రకుల్ తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అంతేకాకుండా ఎన్సీబీ విచారణలో రకుల్ నలుగురు స్టార్ల పేర్లు కూడా వెల్లడించినట్లు ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ నిజంగా డ్రగ్స్ దాచినట్లు అంగీకరించినట్టైతే ఆమె అరెస్ట్ తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు.

ప్రముఖ న్యాయవాది రిజ్వాన్ మర్చంట్ మాట్లాడుతూ ఇది నిజమే అయితే ఎన్డీపీఎస్ చట్టం 8(సి) ప్రకారం డ్రగ్స్ ను దాచడం పెద్ద నేరమని పేర్కొన్నారు. రకుల్ స్టేట్మెంట్ ఇవ్వడం నిజమైతే ఆమె అరెస్ట్ తప్పదని.. డ్రగ్స్ వాడడం కంటే ఇది పెద్ద నేరమని ఆయన తెలిపారు. ఆమె తన వద్ద ఉంచుకున్న డ్రగ్స్ పరిమాణాన్ని బట్టి ఆమెకు బెయిల్ అర్హత ఉందా లేదా అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఈ స్టేట్మెంట్ నిజమైతే సెక్షన్ 27 కింద ఈ కేసులో డ్రగ్స్ వినియోగించేవారి కన్నా ఆమెను అరెస్టు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని సీనియర్ లాయర్ రిజ్వాన్ చెప్పినట్లు ‘పింక్ విల్లా’ పేర్కొంది. ఏదేమైనా రియాతో స్నేహమే ఆమె కొంప ముంచిందని రకుల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.