‘జేమ్స్ బాండ్ 007’ హీరో మృతి…!

0

ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ (90) కన్నుమూశారు. ప్రస్తుతం బహమాస్ లో ఉన్న కానరీ నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’ సినిమాలో తొలి గూఢచారి జేమ్స్ బాండ్ గా కనిపించారు కానరీ. ఆ తర్వాత వచ్చిన ‘జేమ్స్ బాండ్’ సిరీస్ లో 1962 – 83 మధ్య కాలంలో మొత్తం ఏడు సినిమాలలో బాండ్ పాత్రధారిగా కానరీ నటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరించిన సీన్ కానరీ.. ‘ది విండ్ అండ్ ది లైన్’ ‘ది మేన్ హు వుడ్ బి కింగ్’ ‘ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ ‘ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్’ ‘ది అన్ టచబుల్స్’ ‘ది రాక్’ వంటి సినిమాల్లో నటించాడు.

కాగా సీన్ కానరీ ఆస్కార్ అవార్డుతో సహా మూడు గోల్డెన్ గ్లోబ్స్ మరియు రెండు బాఫ్తా అవార్డులు కూడా సాధించారు. ‘ది అన్ టచబుల్స్’ సినిమాలో పోలీసు అధికారిగా అద్భుతమైన నటన కనబరిచి ఉత్తమ సహాయనటుడు కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ప్రతిష్ఠాత్మక నైట్ హుడ్ పురష్కారం కూడా అందుకున్నారు. కానరీ 1999లో పీపుల్స్ మ్యాగజైన్ ‘సెక్సియస్ట్ మేన్ ఆఫ్ ది సెంచరీ’గా ఎంపికయ్యారు. 2008లో కానరీ తన ఆటోబయోగ్రఫీ ‘బీయింగ్ ఎ స్కాట్’ ను ప్రచురించారు. ఎన్ని సినిమాల్లో నటించినా కానరీని ‘జేమ్స్ బాండ్ 007’ చిత్రాలే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ను ఇప్పటికీ వింటూనే ఉన్నాం. సీన్ కానరీ మృతికి ప్రస్తుత జేమ్స్ బాండ్ డానియెల్ క్రెయిగ్ సంతాపం ప్రకటించారు.