ఆకట్టుకుంటున్న ‘కాదల్’ టీజర్..!

0

విశ్వంత్ – చిత్రా శుక్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”కాదల్”. కళ్యాణ్ జీ గొంగన ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి పరిచయమవుతున్నాడు. టఫెనెడ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్ పై కిరణ్ రెడ్డి మందాడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ మద్దుకూరి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ‘కాదల్’ సినిమాకి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘కాదల్’ మూవీ టీజర్ చూస్తుంటే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇది 2004లో జరిగిన ప్రేమ కథ అని టీజర్ లో పేర్కొన్నారు. హీరోయిన్ ని చూడగానే ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించే యువకుడిగా హీరో విశ్వంత్ కనిపించాడు. హీరోయిన్ ని లైన్ లో పెడుతున్న హీరోతో ‘ఆ అమ్మాయి నీకు కూడా అక్కే.. అలా చూడమాక..’ అంటూ తండ్రి చెప్పే డైలాగ్ యూత్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటోంది. అలానే ‘నా వయసు నీకంటే ఎక్కువని బాధపడుతున్నావా?’ అని హీరోయిన్ అడిగితే.. ‘అబ్బే.. ఏజ్ తో పనేముంది.. మాములుగా మాట్లాడటానికి’ అంటూ హీరో చెప్పడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ అందించిన థీమ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది.

ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ – రాకేందు మౌళి – దేవి ప్రసాద్ – అన్నపూర్ణమ్మ – రాకెట్ రాఘవ – అప్పాజీ అంబరీష్ – రూపా లక్ష్మి – డీజే దినేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కేరింత’ ‘మనమంతా’ ‘జెర్సీ’ ‘తోలుబొమ్మలాట’ ‘ఓ పిట్టకథ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విశ్వంత్ ”కాదల్” సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.