Templates by BIGtheme NET
Home >> Cinema News >> కార్తీ తెలుగు కష్టానికి ఈసారైనా ఫలితం దక్కేనా?

కార్తీ తెలుగు కష్టానికి ఈసారైనా ఫలితం దక్కేనా?


తమిళ్‌ హీరోల సినిమాలు తెలుగు లో మంచి వసూళ్లు దక్కించుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. తెలుగు హీరోల రేంజ్ లో కొందరు తమిళ హీరోలు ఇక్కడ స్టార్‌ డమ్ దక్కించుకున్నారు. అందులో కార్తీ ఒకడు అనడంలో సందేహం లేదు. ఆ మధ్య లో కార్తీ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగు లో విడుదల అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

అప్పటి నుంచి కార్తీ నటించిన ప్రతి ఒక్క సినిమాను తెలుగు లో కచ్చితంగా విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కార్తీకి తెలుగు లో ఆశించిన కమర్షియల్‌ సక్సెస్ దక్కలేదు. అయినా కూడా తెలుగు మార్కెట్‌ పై ఆయన ఆశలు వదులుకోలేదు. తెలుగు లో ఆయన సినిమాలను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

తాజాగా కార్తీ నటించిన విభిన్న చిత్రం ‘జపాన్‌’. ఈ సినిమా ను తెలుగు లో అన్నపూర్ణ స్టూడియోస్ వారు విడుదల చేస్తున్నారు. కార్తీ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఆయన ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు మరియు మీడియా వర్గాల వారు అంటున్నారు.

సాధారణంగా ఈ మధ్య కాలంలో కొందరు తమిళ్‌ హీరోలు తెలుగు లో తమ సినిమాలు విడుదల అయినా కూడా ఇక్కడ ప్రమోషన్‌ చేసేందుకు రావడం లేదు. కానీ కార్తీ మాత్రం జపాన్ సినిమా తెలుగు ప్రచారం కోసం ఏకంగా మూడు రోజుల సమయం కేటాయించినట్లుగా తెలుస్తోంది.

రిలీజ్ ఈవెంట్‌ కు ముందు రోజు హైదరాబాద్ చేరుకున్న కార్తీ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అంతే కాకుండా కొన్ని షో ల్లో కూడా కనిపించబోతున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పూర్తి అయిన తర్వాత కూడా పలు కార్యక్రమాల్లో కార్తీ కనిపించబోతున్నాడు. జపాన్ ను తెలుగు లో అగ్రెసివ్‌ గా ప్రచారం చేస్తున్నాడు.

తెలుగు లో సక్సెస్ కోసం కార్తీ చాలా కష్టపడుతున్నాడు. మరి అతడి కష్టంకు జపాన్ కమర్షియల్‌ గా విజయాన్ని సొంతం చేసుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జపాన్ ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే డైరెక్ట్‌ తెలుగు సినిమాను కూడా కార్తీ చేసేందుకు రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి కార్తీకి దీపావళి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.