కొత్త హీరోయిన్ ను బుక్ చేసిన యూవీ క్రియేషన్స్

0

ఒక వైపు ప్రభాస్ తో వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ వారు మరో వైపు చిన్న బడ్జెట్ సినిమాలను క్రమం తప్పకుండా నిర్మిస్తూ వస్తున్నారు. ఈ మద్య కాలంలో టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా యూవీ క్రియేషన్స్ నిలిచింది. ప్రభాస్ హోం బ్యానర్ గా పేరు పొందిన యూవీ క్రియేషన్స్ లో ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. వర్షం చిత్ర దర్శకుడు దివంగత శోభన్ తనయుడు సంతోష్ ప్రత్యేక శ్రద్దతో ప్రభాస్ చేయిస్తున్న సినిమా ఇది అంటూ సమాచారం అందుతోంది.

సంతోష్ శోభన్ హీరోగా ఇప్పటికే పరిచయం అయ్యాడు. అయితే ఆ సినిమా నిరాశపర్చడంతో కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా సంతోష్ కు రీ లాంచ్ అవుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా కోసం మోడల్ కమ్ హీరోయిన్ అయిన కావ్య థాపర్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈమె తెలుగులో ఈ మాయ పేరేమిటో అనే సినిమాను చేసింది. కాని ఆ సినిమా వచ్చినట్లుగా కూడా జనాలు గుర్తించలేదు. కనుక ఆమెకు కూడా తెలుగులో ఇది రీలాంచ్ అవుతుందని అంటున్నారు.

తమిళం మరియు హిందీలో ఈమె నటించిన సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈమె నటన విషయంలో యూవీ వారు ఆసక్తిని కనబర్చారు. పైగా సంతోష్ శోభన్ కు ఈమె బాగా సూట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈమెను ఎంపిక చేశారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. అతి త్వరలో సినిమాను పట్టాలెక్కించి వచ్చే యేడాది ఆరంభంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.