Templates by BIGtheme NET
Home >> Cinema News >> అదే రోజు ‘కేజీఎఫ్ 2’ టీజర్..!

అదే రోజు ‘కేజీఎఫ్ 2’ టీజర్..!


‘బాహుబలి’ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అయిన దక్షిణాది చిత్రాల్లో ‘కేజీఎఫ్’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ‘కేజీఎఫ్ 2’ ని ఎక్కడా రాజీ పడకుండా హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి ప్రారంభమైన ఈ చిత్ర హైదరాబాద్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ అభిమానులకు ఓ స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.

‘కేజీఎఫ్: చాప్టర్ 1’ సినిమా 2018 డిసెంబర్ 21న విడుదలై మంచి విజయం అందుకోవడంతో.. సెంటిమెంటుగా 2019 డిసెంబర్ 21న ‘కేజీఎఫ్: చాప్టర్ 2’లో యశ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదే క్రమంలో నేడు(2020 డిసెంబర్ 21) కూడా ‘కేజీఎఫ్ 2’ నుంచి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. జనవరి 8న తేదీన రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు ఈ చిత్ర టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఒక ఏడాది ఆలస్యమైనా అంతకంటే పెద్ద అప్డేట్ తో వస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. అదే రోజు రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

కాగా ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ సినిమాలో మిగిలిపోయిన ప్రశ్నలకు ‘కేజీఎఫ్ 2’ లో సమాధానం లభించనుంది. కోలార్ గోల్డ్ మైన్స్ ఆధిపత్యం కోసం రాకీ భాయ్ – అధీరా ల భీకరమైన పోరును ఇందులో చూపించబోతున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవీ బాస్రుర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రం కన్నడ తెలుగు తమిళ మలయాళం హిందీ భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.