ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

0

ప్రముఖ గాయకుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య ఆస్పత్రిలో కన్నుమూశారు. సరిగ్గా ఈ మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఆయన చనిపోయారని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

కరోనా బారినపడిన ఎస్పీ బాలు ఆగస్టు 4న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్నా కూడా ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే బాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిపుణులైన వైద్యబృందం చికిత్స అందిస్తున్నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు.

నిన్నటి నుంచి ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఎక్మో వెంటిలేటర్ పైనే ఉన్నారు. వైద్యులు శతవిధాలా ఆయనను కాపాడేందుకు కృషి చేశారు. ఎక్మో ట్రీట్ మెంట్ అంటే ఫైనల్ స్టేజ్ లోనే ఉన్నాడని.. అది కోమాలోనే ఉన్నట్టు.. అది తీసేస్తే ప్రాణం పోయినట్టే లెక్క. బాలు ఇక కోలుకోడని.. ఇక ఆయన బతకడని నిన్న రాత్రే వైద్యులు కూడా కన్ఫం చేసినట్టు తెలిసింది. ఈ మధ్యాహ్నం బాలు శాశ్వతంగా కన్నుమూశారు. దీంతో అధికారికంగా మధ్యాహ్నం 1.04కు బాలు చనిపోయాడని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు.

బాలు ఆరోగ్యం విషమంగా ఉందనే సమాచారం తెలియడంతో ప్రముఖులంతా ఆయనకు కలిసేందుకు ఆస్పత్రికి చేరుకొని ఆయనను పరామర్శించారు. భావోద్వేగానికి గురయ్యారు. బాలు మృతితో చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజ గాయకుడిని కోల్పోయినట్టైంది. సినీ పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఎస్పీ బాలసుబ్రహణ్యం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో పాటలు పాడి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సాంబమూర్తి-శంకుతల. ఇటీవలే బాలసుబ్రహణ్యం 74వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన అభిమానులు బాలసుబ్రహమణ్యంను ముద్దుగా ‘బాలు’ అని పిలుచుకుంటారు. ఆయన తెలుగు హిందీ కన్నడ తమిళ తదితర భాషల్లో 40వేలకు పైగా పాటలుపాడారు.

బాలసుబ్రహణ్యం తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ పెరిగింది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్ చేశాడు. చదువుకుంటూనే అనేక వేదికలపై పాటలు పాడారు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా బాలు చిత్రసీమకు గాయకుడిగా పరిచయం అయ్యాడు.అప్పటి నుంచి ఇప్పటిదాకా గాయకుడిగా.. నటుడిగా పేరు పొందారు.