సర్ ప్రైజ్! ఎట్టకేలకు సెట్లో ప్రత్యక్షమైన మహేష్!!

0

వైరస్ మహమ్మారి బెంబేలెత్తించడంతో ఎక్కడ షూటింగులు అక్కడే గప్ చుప్ అన్నట్టే అయిపోయింది పరిస్థితి. ఐదారు నెలలుగా స్టార్లంతా ఖాళీ. స్టార్లు సూపర్ స్టార్లు కోవిడ్ విలయం తగ్గేవరకూ ఇళ్లకే అంకితమవ్వాలని డిసైడయ్యారు. కానీ కోవిడ్ ఎక్కడా తగ్గడం లేదు. రోజురోజుకు పరిస్థితి ఇంకా క్లిష్ఠమవుతూనే ఉంది. కరోనాతో సహజీవనం చేయాలని పాలకులే డిసైడ్ చేసి అన్నిటికీ అన్ లాక్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగులకు అనుమతులిచ్చేశారు. నియమాలు పాటిస్తూ కోవిడ్ నుంచి బయటపడాలని చెప్పారు.

ఇన్నాళ్లు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జూబ్లీ హిల్స్లోని తన ఖరీదైన బంగ్లాకు పరిమితం అయ్యారు. షూటింగుల్లో పాల్గొననే లేదు. దాదాపు ఏడు నెలల తరువాత మహేష్ చివరకు అన్ లాక్ 4.0 లో తిరిగి సెట్లోకి వచ్చారు. బుధవారం- గురువారం రెండ్రోజుల పాటు ఆయన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఓ వాణిజ్య ప్రకటన కోసం షూటింగ్ లో పాల్గొంటున్నారు.

షూట్ నుండి మహేష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షికార్ చేస్తోంది. ఈ ఫోటోలో పసుపు చొక్కా – బ్రౌన్ ప్యాంటులో తెలుపు స్పోర్ట్స్ షూలతో కనిపిస్తున్నారు. చేతిలో ముసుగు ఉంది. కాఫీ సిప్ చేస్తూ అతను దర్శకుడితో సంభాషించడం కనిపిస్తుంది. ఇక ఆన్ లొకేషన్ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రకటన నిర్మాణ బృందం పిపిఇ కిట్లు.. ఫేస్ మాస్క్ లు.. క్రిమిసంహారక శానిటైజర్లు రెడీ చేశారట. సామాజిక దూర నిబంధనల వంటి అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మహేష్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉన్నారు. ఇందులో త్రోబాక్ అంశాలు.. సినిమాలు.. పుస్తకాల గురించి చెబుతున్నారు. పిల్లలతో ఎంతో ఆరుదైన క్షణాలు రివీల్ చేస్తున్నారు. డేనియల్ గోలెమాన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ .. యువాల్ నోహ్ హరారీ సేపియన్స్ వంటి పుస్తకాలను చదువుతుండడంపై హింట్ ఇచ్చారు. త్వరలో పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.