ప్రకాష్ రాజ్ చేసిన ‘ఊసరవెల్లి’ కామెంట్స్ పై మెగా బ్రదర్ ఫైర్..!

0

తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సినీ నటుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడాన్ని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”నువ్వొక లీడర్. మీకొక పార్టీ ఉంది. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి?.. ఏపీలో గాని ఇంకో చోట గాని.. జనసేన ఓట్ షేర్ ఎంత.. బీజేపీ ఓటు షేర్ ఏంటి? 2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం ఇంద్రుడు చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు వాళ్లు ద్రోహులు అన్నారు. మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు అంటున్నారు. అంటే ఇలా మూడు నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా” అని విమర్శించారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందిస్తూ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రకాష్ రాజ్ కి నా ఆన్సర్ అంటూ ”రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యాలు లాంగ్ టర్మ్ లో ప్రజలకు పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. పవన్ కళ్యాణ్ ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్.. నీ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లోనే అర్థం అయ్యింది. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు. అలాగే బీజేపీ గాని మరే పార్టీ గాని మంచి చేస్తే హర్షించగలగాలి. విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీ ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమి శక్తిని ఆపలేరు. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. ఆ తర్వాత మాట్లాడు. డైరెక్టర్స్ ని కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తినే నీకు ఇంత కంటే మంచిగా మాట్లాడడం ఏమి తెలుసు. బీజేపీ నేతల్ని నువ్వు ఎన్ని మాటల అన్నా వాళ్లు నిన్ను ఏమీ అనడం లేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో. మీడియా అడిగింది కదాని ఒళ్లు పొంగి నీ పనికి మాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు” అని నాగబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.