వెబ్ సిరీస్ ప్రొడక్షన్ లోకి యువ హీరో…?

0

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య సినిమా ప్రొడక్షన్ లోకి కూడా దిగిన సంగతి తెలిసిందే. ఐరా క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘ఛలో’ ‘అశ్వథామ’ వంటి సినిమాలు నిర్మించారు. అయితే ఇప్పుడు శౌర్య వెబ్ సిరీస్ నిర్మాణంలో కూడా పాలుపంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెబ్ సిరీస్ లను ప్రొడ్యూస్ చేస్తున్న శరత్ మారర్ సహకారంతో.. నాగ శౌర్య సొంత బ్యానర్ లో ఓ సిరీస్ ని నిర్మించడానికి ప్లాన్స్ జరుగుతున్నాయని సమాచారం. దీని తర్వాత ఐరా క్రియేషన్స్ లో తనే హీరోగా నటిస్తూ మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడట. ఈ చిత్రానికి ‘అలా ఎలా’ ఫేమ్ అనిష్ కృష్ణ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం శౌర్య కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అయితేనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

కాగా శౌర్య ప్రస్తుతం ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో శౌర్య ఆర్చర్ గా కనిపించనున్నాడు. నాగ శౌర్య కెరీర్ లో 20వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత శౌర్య హోమ్ బ్యానర్ లో సినిమా ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇక నాగ శౌర్య సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ సినిమాను హోల్డ్ లో పెట్టి ఉండొచ్చని ఫిలిం సర్కిల్స్ లో అంటున్నారు. దీంతో NS21 ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.