భారీ వర్కౌట్స్ తో చెమటలు కక్కిస్తున్న యువ హీరో..!

0

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య తన కొత్త సినిమాల కోసం మేకోవర్ అవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. శౌర్య జిమ్ లో భారీ కసరత్తులు చేసిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా తన మేకోవర్ కోసం ఉపయోగించుకున్న యంగ్ హీరో.. కండలు తిరిగిన 8 ప్యాక్ బాడీని సిద్ధం చేశాడు. ఇప్పటివరకు చాక్లట్ బాయ్ – లవర్ బాయ్ తరహా పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్న శౌర్య.. ప్రస్తుతం తాను నటిస్తున్న NS20 కోసం ఈ లుక్ లోకి మారాడు. ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు – శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా NS20 కోసం జిమ్ లో చెమటలు కక్కిస్తున్న నాగ శౌర్య ఫోటో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

నాగశౌర్య ఈ ఫొటోలో కఠోర వర్కౌట్స్ చేస్తూ కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తున్నాడు. గుబురు గడ్డంతో ఉన్న శౌర్య బ్లాక్ క్యాప్ పెట్టుకొని స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాలో ఆర్చర్ గా కనిపించడానికి ఇంతలా కష్ట పడుతున్న నాగశౌర్య కమిట్ మెంట్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. వర్క్-ఎ-హోలిక్ అయిన నాగశౌర్య ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం 5 రోజులు నీళ్లు కూడా త్రాగలేదని తెలుస్తోంది. కనీసం తన లాలాజలం కూడా మింగకుండా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతూ ఆ సీన్స్ కంప్లీట్ చేశాడట. శౌర్య కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా నాగశౌర్య దీంతో పాటు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే హోమ్ ప్రొడక్షన్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.