సౌత్ లో ఆ లేడీ డైరెక్టర్ పేరు ఆ రేంజులో మార్మోగుతోంది

0

సున్నితమైన ఉద్వేగాల్ని అందంగా తెరపై ఆవిష్కరించే స్కిల్ కొద్దిమంది దర్శకులకే ఉంటుంది. మసాలా కమర్షియల్ అంశాలతో సినిమాలని తెరకెక్కించే నైపుణ్యం కంటే ఇది ఎంతో కాంప్లికేటెడ్. అయితే ఆ తరహా కంటెంట్ ని ఎంచుకుని గట్స్ చూపిస్తున్న అరుదైన మహిళా దర్శకురాలిగా సుధ కొంగర పేరు మార్మోగుతోంది.

ఇంతకుముందు ఈ దర్శకురాలి పేరు `గురు` సినిమాతో మార్మోగింది. స్పోర్ట్స్ నేపథ్యంలో అద్భుతమైన సినిమా తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు సుధా కొంగర. అయితే గురు కమర్షియల్ గా ఆశించినంత విజయం సాధించలేదు.

తాజాగా మరోసారి ఆకాశం నీ హద్దురా సినిమాతో సుధ పేరు మార్మోగుతోంది. ఈ మూవీ తమిళంలో సూరరై పొట్రూ (తెలుగులో ఆకాసం నీ హద్దూ రా) టైటిల్ తో రిలీజైంది. OTTలో రీసెంట్ బెస్ట్ సినిమా ఇదని క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. ఈ సీజన్ బెస్ట్ హిట్ చిత్రంగా ఈ మూవీ రికార్డులకెక్కింది.

సూర్య నటించిన ఈ స్ఫూర్తిదాయకమైన సెమీ బయోపిక్ దీపావళికి కొన్ని రోజుల ముందు విడుదలై జన హృదయాలను గెలుచుకుంది. సున్నితమైన భావోద్వేగాలను సుధా వాస్తవికంగా ఎలివేట్ చేసిన విధానం .. కథానాయకుడిని వీరత్వాన్ని రక్తం చుక్క లేకుండా చిత్రీకరించిన విధానం విమర్శకులు సహా సినీప్రియుల్ని మెప్పించింది. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుండి ఆమె ప్రశంసలను గెలుచుకుంటుంది. చాలా గ్యాప్ తర్వాత సూర్యా చివరకు క్లీన్ హిట్ అందుకున్నారంటే అది సుధా ట్యాలెంట్ వల్లనే అన్న ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇంతకీ సుధ కొంగర మూలాలు ఎక్కడ? అని ప్రశ్నిస్తే .. ఆమె తెలుగమ్మాయే. గుంటూరు.. వైజాగ్ లో మూలాలున్న తెలుగమ్మాయి సుధా అనే విషయం చాలా మందికి తెలియదు. కొన్నేళ్లుగా మణిరత్నం వద్ద శిష్యరికం చేసిన సుధ కొంగర ‘ఆంధ్రా అందగాడు’ (కృష్ణభగవాన్ హీరో) అనే హాస్య చిత్రంతో టాలీవుడ్ కి దర్శకురాలిగా సుపరిచితులయ్యారు. 2008 లో విడుదలైన ఈ చిత్రం పరాజయం పాలైంది. తరువాత ఆమె 2010 లో కోలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు పొందిన థ్రిల్లర్ ‘ద్రోహి’ తో అదరగొట్టింది. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత సుధ తిరిగి .. మాధవన్ – రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో బాక్సింగ్ డ్రామా ‘సాలా ఖాదూస్’ తో దేశం దృష్టిని ఆకర్షించింది. ఆమె ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్- రితికా సింగ్ లతో ‘గురు’ గా రీమేక్ చేసింది. తాజాగా సూరరై పొట్రూ విజయంతో సుధ కొంగర పేరు మరోసారి మార్మోగుతోంది. ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ లో ఫేమస్ లేడీ డైరెక్టర్ గా వెలిగిపోతోంది. చాలా మంది స్టార్ హీరోలు ఆమెతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే స్టార్ హీరో తళా అజిత్తో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ చేయనుందన్న సమాచారం ఉంది. విజయ్ .. విజయ్ సేతుపతి లాంటి టాప్ హీరోలు సుధ కొంగర వెంట పడుతున్నారట. అటు తమిళం ఇటు తెలుగు పరిశ్రమలోనూ ప్రస్తుతానికి ఈ లేడీ డైరెక్టర్ పేరు మార్మోగుతోంది.