హిందీ ‘జెర్సీ’ పై కోట్లు కురిపించేందుకు వారు సిద్దం

0

నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ సినిమా కమర్షియల్ గా గొప్పగా నిలవకున్నా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని ఒక మంచి సినిమాగా మాత్రం పేరు దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. జెర్సీ సినిమా హిందీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో దిల్ రాజు మరియు అల్లు అరవింద్ లు అక్కడ రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యారు. షాహిద్ కపూర్ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు.

లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయిన జెర్సీ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ సినిమాను డైరెక్ట్ రిలీజ్ కోసం అమెజాన్ మరియు నెట్ ఫ్లిక్స్ లు చాలా బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు కూడా పోటీ పడి మరీ నిర్మాతలకు ఆఫర్ ఇస్తున్నాయట. పెట్టుబడికి 30 శాతం అధిక మొత్తంను ఇచ్చేందుకు అమెజాన్ సిద్దంగా ఉందనే వార్తలు బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కూడా భారీ మొత్తంను ఇప్పటికే ఆఫర్ చేసిందట.

కాని థియేటర్లు పునః ప్రారంభంకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ సమయంలో నిర్మాతలు దిల్ రాజు అల్లు అరవింద్ లు ఓటీటీ రిలీజ్ కు సుముఖంగా లేరని సమాచారం. అర్జున్ రెడ్డి హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక జెర్సీ కూడా తప్పకుండా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుని వసూళ్ల పంట పండిస్తుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తూ ఓటీటీ ఆఫర్ కు నో చెప్పారని టాక్ వినిపిస్తుంది.