చిత్రపరిశ్రమలో చాలామంది హీరోయిన్లు మోడలింగ్ నుండి వచ్చేవారే ఉంటారు. అయితే అనుకోకుండా అదృష్టం కొద్ది హీరోయిన్ అయ్యేవారు కూడా కొందరుంటారు. ఈ రెండు కాకుండా చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలనే కష్టపడి సినీరంగంలో అడుగుపెట్టింది కుర్రభామ నిధి అగర్వాల్. ఈ అమ్మడు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంటూ పెరిగిందట. మున్నా మైకేల్ సినిమాతో హీరోయిన్ గా మారిన నిధి.. ఫలితం లేకపోవడంతో వెంటనే సౌత్ ఇండస్ట్రీ వైపు దృష్టిపెట్టింది. కానీ కొందరు హీరోయిన్లకి పట్టుదల పరువాలతో పాటు అదృష్టం కూడా కావాల్సి ఉంటుంది. నిధి విషయంలో అదృష్టం అనేది ఆవగింజంత కూడా లేదట. ఎందుకంటే ఇప్పటివరకు అమ్మడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.
తెలుగులో సవ్యసాచి మిస్టర్ మజ్ను సినిమాలతో ప్లాప్స్ అందుకున్న నిధి.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ ఆ సినిమాతో నిధికి మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు. అయితే ఈ ఏడాది తమిళంలో మాత్రం నిధి చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. హీరో శింబుతో ఈశ్వరన్ జయం రవితో భూమి సినిమాలు చేసింది నిధి. ఆ రెండు హిట్ అవ్వడంతో అమ్మడికి తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయట. అయితే తాజాగా నిధి ఇండస్ట్రీలో అదృష్టం కూడా ఉండాలని చెబుతోంది. అమ్మడు మాట్లాడుతూ.. నేను చేసిన సినిమా ఆడినా ఆడకపోయినా నావంతు కృషి చేసానని భావిస్తాను. నిజాయతీగా చెప్పాలంటే.. ఈ సినీరంగంలో రాణించాలంటే అదృష్టం కంపల్సరీ అంటోంది. కొన్నిసార్లు స్క్రిప్ట్ బాగున్నా సినిమాలు పోతాయి. మరికొన్ని స్క్రిప్ట్ బాలేకపోయినా హిట్ అవుతాయి. అందం కంటే అదృష్టం మిన్న అనుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. ప్రస్తుతం అమ్మడు గల్లా జయదేవ్ కొడుకు అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమాలో నటిస్తోంది.