ప్రభాస్ తర్వాత నితిన్.. రేంజ్ రోవర్ గిఫ్ట్

0

హీరోలు తమకు ఇష్టమైన దర్శకులకు లేదా వ్యక్తిగత సిబ్బందికి కార్లను బహుమానంగా ఇవ్వడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. శ్రీమంతుడు సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివకు మహేష్ బాబు ఆడి కారును గిప్ట్ గా ఇచ్చాడు. ఆ తర్వాత అంతకు ముందు కూడా చాలా కానుకలు ఇలాంటివి చూశాం. కాని ఈమద్య కాలంలో ప్రభాస్ తన ట్రైనర్ కు ఏకంగా రేంజ్ రోవర్ కారును గిప్ట్ గా ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. 65 నుండి 75 లక్షలకు పైగా ఖరీదు ఉండే రేంజ్ రోవర్ ను ప్రభాస్ ట్రైనర్ కు గిఫ్ట్ గా ఇవ్వడంతో అంతా కూడా అవాక్కయ్యారు. ఇప్పుడు ప్రభాస్ దారిలో మరో యంగ్ హీరో నితిన్ కూడా తనకు ఆప్తుడు అయిన దర్శకుడు వెంకీ కుడుములకు రేంజ్ రోవర్ ను బహుమానంగా ఇచ్చాడు.

ఈ ఏడాది ఆరంభంలో నితిన్ ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా పరాజయాల్లో ఉన్న నితిన్ కు భీష్మ మంచి బూస్టింగ్ ను ఇచ్చింది. పెళ్లికి ముందు భీష్మ వంటి సూపర్ హిట్ రావడంతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తన కోసం రెండు సంవత్సరాలు కేటాయించి మరీ ఈ సినిమాను చేసినందుకు గాను దర్శకుడు వెంకీ రుణం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకు గాను కారు బహుమానంగా ఇవ్వాలనుకున్నాడు. ప్రభాస్ తన ట్రైనర్ కు ఇచ్చినట్లుగా వెంకీకి కూడా ఇస్తే బాగుంటుందని అనుకున్నాడో ఏమో కాని వెంటనే రేంజ్ రోవర్ ను వెంకీ బర్త్ డే కానుకగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

భీష్మ సినిమాతో ఈ ఏడాదిలో బన్నీ తర్వాత స్థానంలో నిలిచిన నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను అతి త్వరలోనే యూరప్ వెళ్లి చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు సంబందించి ఇప్పటికే ఒక ప్రోమో వీడియో విడుదల అయ్యింది. ఆ వీడియోతో సినిమా గురించి జనాల్లో చర్చ మొదలైంది. ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను నితిన్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.