కోహ్లి డిప్రెషన్ కు అనుష్క అందానికి ముడి పెట్టాడేమిటి?

0

2014 ఇంగ్లాండ్ పర్యటనలో తాను డిప్రెషన్కు గురయ్యానని విరాట్ కోహ్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.‘విరాట్ కోహ్లీ కుంగుబాటుకు గురయ్యానని చెప్పడంతో నేను ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. కోహ్లీకి ఎంతో అందమైన భార్య ఉంది. అప్సరస లాంటి భార్య ఉండటం అతడి అదృష్టం. అతడికి ఇప్పుడో కూతురు కూడా పుట్టింది. నిజానికి అంత అందమైన భార్యదొరకడం విరాట్ అదృష్టం. అతడు డిప్రెషన్కు గురికావడం ఏమిటి. నిజానికి అంత అందమైన భార్య దొరికినందుకు విరాట్ దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు ఫరూఖ్.

విరాట్ కోహ్లీ భార్యపై గతంలోనూ పలువురు సీనియర్ క్రికెటర్లు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఓ సారి సునీల్ గవాస్కర్ కోహ్లిపై నోరుపారేసుకున్నాడు.. లాక్డౌన్ టైంలో కోహ్లీ .. తన భార్య అనుష్క శర్మతో క్రికెట్ ఆడాడు. అందుకే ఇప్పుడు సరిగ్గా ఆడలేకపోతున్నాడంటూ గతంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

అయితే తాజాగా మరో మాజీ క్రికెటర్ ఫరూఖ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.అనుష్క ఎంతో అందంగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతున్నది. అయితే ఫరూఖ్ ఈ వ్యాఖ్యలు సరదాగానే చేశారు. దీనిపై విరుష్క దంపతులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. విరాట్ అనుష్క దంపతులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.